ఇదే పని ముందే చేసి ఉంటే ఎంత బాగుండేది?

Update: 2020-07-31 13:00 GMT
రాజకీయ ప్రముఖుల తీరు మహా విచిత్రంగా ఉంటుంది. మారిన కాలానికి తగ్గట్లు.. ప్రజల మనసుల్ని తెలుసుకొని తాము వ్యవహరించాలన్న చిన్న విషయాన్ని వారెలా మిస్ అవుతారో ఒక పట్టాన అర్థం కాదు. రాజకీయ మైలేజీ కోసం విపరీతంగా తపించే వారు.. తమకు అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవటంలో వారికి వారే సాటి అన్నట్లుగా కొందరు ప్రముఖులు వ్యవహరిస్తారు. ఆ కోవలోకే వస్తారు కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్న ప్రియాంక గాంధీ. నానమ్మ ఇందిరమ్మ పోలికల్ని పుణికి పుచ్చుకున్నట్లుగా చెబుతున్నా.. ఇప్పటివరకూ తన చేతల్లో మాత్రం అలాంటి మేజిక్ ను ప్రదర్శించటంలో ఆమె ఫెయిల్ అయ్యారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనను టార్గెట్ చేసినట్లు ప్రభుత్వం వ్యవహరించినప్పుడు.. తన చర్యలతో ప్రజలకు పంపాల్సిన సందేశాన్ని పంపటంలో ఆమె సరిగా వ్యవహరించలేదన్న మాట వినిపిస్తోంది. దాదాపు ఇరవై మూడేళ్లుగా తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో ఆమె నివాసం ఉంటున్నారు. ఈ మధ్యన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమెకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది జరిగిన తర్వాత.. ఆమె ఆ బంగ్లాను విడిచి పెట్టాల్సి ఉంటుంది. మోడీ సర్కారు నుంచి ఇలాంటివి ఊహించాల్సిన ఆమె.. ఆ విషయాన్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించారు. దీంతో.. ఆమెకు జులై ఒకటిన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇందుకు ముప్ఫై రోజులు గడువు ఇచ్చారు. దీంతో.. ఆమె గురుగ్రామ్ లోని ఒక ఇంట్లోకి మారుతారని చెబుతున్నారు. ఢిల్లీలో ఆమె అద్డెకు తీసుకున్న ఇంటికి రిపేర్లు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా గురుగ్రామ్ ఇంట్లోకి మారనున్నారు.

ఇదంతా ఓకే కానీ.. అధికారులు నోటీసుల్లో పేర్కొన్నగడువుకు కేవలం ఒక రోజు ముందు ఇంటిని ఖాళీ చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ కారణాలతోనే ప్రియాంక ఇంటిని ఖాళీ చేయిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలతోపాటు.. ఆ పార్టీకి చెందిన పలువురు సానుభూతిపరులు ఆరోపిస్తున్న వేళ.. నోటీసులు అందుకున్న వెంటనే ఖాళీ చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. అందివచ్చే అవకాశాన్ని గాంధీ ఫ్యామిలీ ఈ మధ్యన సరిగా గుర్తించటం లేదన్న మాట వినిపిస్తోంది. తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇది నిజమేనన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News