ఆరెస్సెస్‌ పై ప్రియాంక గాంధీకి ఎంత గౌరవమో?

Update: 2019-08-20 14:30 GMT
ఆరెస్సెస్ పేరు చెబితేనే మండిపడతారు కాంగ్రెస్ నేతలు.. బీజేపీ చేసే పనులకూ ఆరెస్సెస్‌ నే బాధ్యులను చేస్తుంటారు. అంతేకాదు... ఆరెస్సెస్ ఐఎస్ కంటే ప్రమాదకరమని కూడా ఆ పార్టీ నేతలు ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరెస్సెస్ సిద్ధాంతాలకు బద్ధ విరోధి కాంగ్రెస్ పార్టీ. కానీ... ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె - కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీకే ఏకంగా ఆరెస్సెస్‌ పై ప్రేమ - అభిమానం - గౌరవం అన్నీ పొంగుకొచ్చాయి. ఆరెస్సెస్ విధానాలను మోదీ ఏమాత్రం అనుసరించడం లేదని.. ఆరెస్సెస్ అభిప్రాయాలపై మోదీకి గౌరవం లేదని ప్రియాంక గాంధీ అన్నారు.

రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ... సున్నితమైన అంశాలపై అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనేది మోహన్ భగవత్ అభిప్రాయమని చెప్పారు. ఆరెస్సెస్ విధాలను మోదీ అనుసరించడం లేదని అన్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో కూడా మోదీ ఏకపక్ష నిర్ణయాలనే తీసుకున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపీ పెద్ద సమస్యగా భావించకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘జ్ఞానోత్సవ్‌’ కార్యక్రమంలో రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ‘రిజర్వేషన్లను సమీక్షించాలి’ అని గతంలో ఆయన సూటిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి అలా కాకుండా... ఈ అంశంపై సామరస్య వాతావరణంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ కంటే ఆరెస్సెస్ నయం అనుకున్నారో.. లేదంటే తన తాత తండ్రుల కాలం నుంచి ఆరెస్సెస్ ఏమన్నా కూడా తాము అందుకు వ్యతిరేకంగా మాట్లాడుతామన్న విషయం తెలియదో ఏమో కానీ ఆరెస్సెస్ అభిప్రాయాలను మోదీ గౌరవించడం లేదు.. అనుసరించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  ఏ సమస్యనైనా చర్చించి పరిష్కరించుకోవాలన్న మోహన్ భగవత్ మాటలు జమ్మూకశ్మీర్ అంశానికి సూటయ్యాయన్న ఉద్దేశంతో ప్రియాంక గాంధీ వాటిని ఎత్తుకున్నప్పటికీ ఆమె ఆరెస్సెస్‌ విధానాలను మోదీ అనుసరించాలని అనడం కాంగ్రెస్ పార్టీలోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది.



Tags:    

Similar News