ప్రియాంకతో కాంగ్రెస్ ప్ల‌స్‌!... బీజేపీకి డ‌బుల్ ప్ల‌స్‌!

Update: 2019-05-16 01:30 GMT
అచ్చు గుద్దిన‌ట్టు దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీని పోలిన‌ట్లు ఉన్న ఆమె మ‌న‌వ‌రాలు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సోద‌రి ప్రియాంకా గాంధీ ఎంట్రీతో ఈ ఎన్నిక‌ల్లో కొంత మేర అయినా ఫ‌లితాల్లో మార్పు వ‌స్తుంద‌న్న భావ‌న అయితే అంతటా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మాట క‌రెక్టే గానీ... ఫ‌లితాల్లో వ‌చ్చే మార్పు కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా బీజేపీకి అనుకూలంగా ఉంటుంద‌ట‌. ఈ మేర‌కు జాతీయ న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ ఓ ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌ను విడుద‌ల చేసింది. అన్న ఆదేశించగానే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ ప‌ద‌వితో పాటు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తూర్పు ఇంచార్జీ బాధ్య‌త‌ల‌ను కూడా ప్రియాంక తీసుకున్నారు. విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాకుండా బ‌రిలోనూ బ‌లమైన అభ్యర్థుల‌ను, బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను దించారు. మొత్తంగా ప్రియాంక ఎంట్రీతో యూపీలో 10 శాతం మేర జ‌నం కాంగ్రెస్ వైపు తిరిగేశార‌ట‌.

ఒకేసారి ప‌ది శాతం అంటే మాట‌లు కాదు క‌దా. అయితే కాంగ్రెస్ వైపు తిరిగిన ఈ ప‌ది శాతం మంది జ‌నం బీజేపీకి చెందిన ఓట‌ర్లు కాద‌ట‌. బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా కూట‌మి క‌ట్టిన ఎస్పీ, బీఎస్పీ కూట‌మికి చెందిన 10 శాతం మంది ఓట‌ర్లు కాంగ్రెస్ వైపు తిరిగార‌ట‌. వాస్త‌వానికి ఎస్పీ, బీఎస్పీ కూటమితో కాంగ్రెస్ కూడా జ‌త క‌లిసింది. అయితే ఎస్పీ, బీఎస్పీ కూట‌మి... కాంగ్రెస్ పార్టీని చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డంతో ఆ పార్టీ ప్రియాంక‌ను దించేసింది. ఫ‌లితంగా వైరి వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు కాకుండా... వైరి వ‌ర్గాన్ని ఓడించేందుకు ఒక్క‌ద‌రికి చేరిన ఓట‌ర్ల‌లోని 10 శాతం ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ద‌రికి చేర్చాయ‌ట‌. అంటే... బీజేపీ ఓట‌మి కోసం ఎస్పీ, బీఎస్పీ ఒక్క‌ద‌రికి చేర్చిన ఓట్ల‌లో ప్రియాంక చీలిక‌ను తెచ్చేశార‌న్న మాట‌.

అంటే... బీజేపీని ఓడించేందుకు జ‌త‌కూడిన ఓట్ల‌లో చీలిక వ‌స్తే... అది బీజేపీకి మేలు చేసిన‌ట్టే క‌దా. ప్రియాంక వ‌ల్ల కూట‌మి ఓట్లు ప‌ది శాతం చీలిపోతే... అదే స‌మ‌యంలో అగ్ర‌వర్ణాల ఓట్ల‌న్నీ కూడా బీజేపీకి గ‌ట్టి మ‌ద్ద‌తుగా నిలిచాయ‌ని ఎన్డీటీవీ చెప్పింది. ఇతర వెనుకబడ్డ వర్గాలను తీసుకుంటే బీజేపీకి 55 శాతం మంది మద్దతిస్తుండగా ఎస్పీ-బీఎస్పీకి కేవలం 35 శాతం మందే సపోర్ట్‌ చేస్తున్నారు. కాంగ్రె్‌సకు 10 శాతం మంది మద్దతు దక్కింది. కూటమికి వచ్చిన మరో ఇబ్బందేంటంటే... ఓబీసీలు, ఇతర నిమ్నవర్గాలు తమకు అనుకూలంగా ఏకమయ్యారని ఎస్పీ-బీఎస్పీ చెప్పుకోవడం! దీని వల్ల అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు బీజేపీకి అనుకూలంగా మారారు. 2014తో పోలిస్తే ఈసారి ఈ అగ్రవర్ణాల మద్దతు బీజేపీకి 15 శాతం పెరిగింది.

బీజేపీకి మైనస్‌ పడుతున్నదల్లా ఎస్సీ ఓటు. కమలనాథులు దాదాపు15 శాతం ఎస్సీ ఓటును కోల్పోతున్నారు. ఇందులో 10 శాతం కాంగ్రెస్‌కు వెళుతుండగా, కేవలం 5 శాతం ఎస్పీ-బీఎస్పీకి వెళుతోంది. ఇక మహిళలు, యువతల్లో సగానికి సగం బీజేపీకే జైకొడుతున్నారు. మహిళల్లో ఉజ్వల పథకం (ఉచితంగా వంటగ్యాస్‌) బాగా పనిచేసిందని ఎన్‌డీటీవీ పరిశీలన వివరించింది. యువతలో మాయా, అఖిలేశ్‌, రాహుల్‌ల కంటే మోదీ పట్లే సానుకూలత ఉందని, స్థానికంగా అభ్యర్థి బలహీనంగా ఉన్నా మోదీకే తమ ఓటు అని యువత చెబుతున్నారని ఈ పరిశీలన వెల్లడించింది. మొత్తం మీద, యూపీలో బీజేపీ పరిస్థితి అంత గడ్డుగా ఏమీ లేదని, ఎస్పీ-బీఎస్పీ కంటే బాగా మెరుగ్గా ఉందని పేర్కొంది.


Tags:    

Similar News