చెరుకు తోట తగలబెట్టించింది ఆయన వాళ్లేనా?

Update: 2015-10-27 13:13 GMT
ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో ఐదు ఎకరాల చెరుకుతోట తగలబడటంపై రాజకీయ విమర్శలు జోరుగా రాజుకుంటున్నాయి. ప్రభుత్వమే చెరుకుతోటల్ని తగలబెట్టించిందని.. చెరుకుతోట తగలబడటం వెనుక ఏపీ అధికారపక్షం హస్తం ఉందని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై ఏపీ మంత్రులు ధీటుగా స్పందిస్తున్నారు. తమ విమర్శలతో జగన్ వాదనలో పస లేదని తేల్చేస్తున్నారు.

తుళ్లూరు ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా భూసమీకరణకు సహకరించారని.. ఒకట్రెండు పర్సెంటుకు మినహా మిగిలిన వారంతా తమ పొలాల్ని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేశారని.. అలాంటప్పుడు చెరుకుతోటను తగలబడే అవకాశమే లేదని మంత్రులు చెప్పేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఒక పోలిక తీసుకొచ్చారు. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన సమయంలో ఇలానే పంట తగలబెట్టించారని.. ఇప్పుడు అమరావతి శంకుస్థాపన పూర్తి అయిన తర్వాత మరోసారి తగలెబ్టించారని.. ఇదంతా కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు.

విపక్ష నేత జగన్ కు నేరపూరిత ఆలోచనలు ఎక్కువని.. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులైన తండ్రి.. తాతలు కూడా నేరపూరిత ఆలోచనలు చేస్తారని.. అదే అలవాటు జగన్ కు వచ్చిందని.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది స్పష్టమవుతుందని మంత్రులు మండిపడుతున్నారు. చెరుకుతోటకు మంట పెట్టిన ఉదంతంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందని.. దీని వెనుక ఎవరున్నది త్వరలోనే తేలుతుందని వారు చెబుతున్నారు.

అధికార.. విపక్షనేతల మధ్య ఐదెకరాల చెరుకుతోట దగ్థమైన విషయం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. ఇక.. మంత్రి పత్తిపాటి పుల్లారావు అయితే.. చెరుకుతోట దగ్థం వ్యవహారంలో జగన్.. జగన్ పార్టీ నేతల హస్తం ఉందన్న సమాచారం తమ వద్ద ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఊరికే సమాచారం ఉందని విమర్శిస్తే సరిపోదు. అందుకు తగ్గ ఆధారాలు చూపిస్తే బాగుండేది. మంత్రి దగ్గర సమాచారం ఉంటే.. దాన్ని పోలీసులకు అందించింది కేసులు ఎందుకు పెట్టటం లేదని విపక్ష నేతలు మండి పడుతున్నారు. మొత్తంగా చెరుకుతోట దగ్థం వ్యవహారం అధికార.. విపక్షాల మధ్య మాటల మంటల్ని మరింత పెంచుతోంది.
Tags:    

Similar News