తుదిశ్వాస విడిచిన ప్రబోధానంద స్వామి !

Update: 2020-07-09 13:30 GMT
అనంతపురం జిల్లాకి చెందిన వివాదాస్పద త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం తుదిశ్వాస విడిచారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి లో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ సమయంలోనే చికిత్స కోసం ఆయన్ని ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలుస్తుంది.

ప్రబోధానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె గ్రామంలో 1950లో జన్మించారు. మొదట్లో ఇండియన్ ఆర్మీలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఆర్మీ నుంచి వచ్చాక తాడిపత్రిలోనే కొన్నేళ్లు ఆర్ ఎం పీ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయుర్వేదంపై పలు పుస్తకాలు రాశారు. అలాగే ఆధ్యాత్మిక అంశాలపై కూడా పలు పుస్తకాలు రాశారు. అలా కొన్నాళ్లుగా ఆయనే ఆధ్యాత్మిక గురువుగా మారి తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఈ సిద్ధాంత సారాంశం.

ఇకపోతే , రెండేళ్ల క్రితం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులపై, ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడడంతో ఈ ఆశ్రమం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే అయన అంత్యక్రియలు రేపు తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమంలో నిర్వహించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News