ఏపీలో పోస్టర్ కలకలం.. తర్వాతి ముఖ్యమంత్రి అంటూ బాబుకు షాక్

Update: 2020-12-29 00:30 GMT
ఏపీలో ఒక పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏ మాత్రం నచ్చని రీతిలో ఉన్న ఆ పోస్టర్ ను.. టీడీపీకి చెందిన ఛోటా నేతలు ఏర్పాటు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ రాకతో.. ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోవటం.. బలమైన అధినేతగా అవతరించటం తెలిసిందే. సమీప భవిష్యత్తులో చంద్రబాబుకు అవకాశం ఇవ్వని రీతిలో ఆయన పాలన సాగుతోంది.

మరోవైపు చంద్రబాబు వయసు అయిపోవటం.. ఆయన రాజకీయ వారసుడిగా భావించిన నారా లోకేశ్ ఎలాంటి  ప్రభావాన్ని చూపించకపోవటంతో ప్రత్యామ్నాయం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. నిజానికి.. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తరచూ వస్తుంటుంది. పార్టీ అవసరాలకు ఆయన్ను వాడేసిన బాబు.. ఆయనకు గౌరవనీయ స్థానాన్ని కట్టబెట్టే విషయంలో మాత్రం తనదైన శైలిలో వ్యవహరించారు. దీంతో.. పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ప్రస్తావనను తాజాగా టీడీపీకి చెందిన సానుభూతి పరులు తెర మీదకు తెచ్చారు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒక ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి ముఖ్యమంత్రిగా పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు.. టీడీపీ నేతల ఫోటోలు ఉన్నాయి. కాకుంటే.. ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వారు ఎవరన్న వివరాలు మాత్రం లేకుండా ఏర్పాటు చేయటం టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబుకు మాత్రం ఈ ఫ్లెక్సీ ఏ మాత్రం మింగుడుపడదని మాత్రం చెప్పక తప్పదు.
Tags:    

Similar News