ఆర్ఎస్ఎస్ కి ప్రకాష్ రాజ్ సవాల్....కాలిందా అంటూ సెటైర్లు

ఆర్ఎస్ఎస్ మీద ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేసిందని ప్రశ్నించారు.;

Update: 2025-12-28 03:50 GMT

ఆర్ఎస్ఎస్ మీద ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేసిందని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అంటే విషం అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ పుట్టి వందేళ్ళు అయిందని దేశ సేవలో పాత్ర ఏమిటి అని నిలదీశారు స్వాతంత్రం పూర్వం పుట్టిన ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరైనా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఉంటే ఒకటి రెండు పేర్లు చెప్పాలని సవాల్ చేశారు.

లాగులు ప్యాంట్లుగా :

విశాఖలో సీఐటీయూ ఉత్సవాలకు హాజరైన ప్రకాష్ రాజ్ ఆర్ఎస్ఎస్ ఈ వందేళ్ళలో సాధించింది ఏంటి అంటే లాగుల నుంచి ప్యాంటుల దాకా రావడమే అని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ దేశం మనదని అంటారు కదా దేశానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అది ఒక సంస్థ కానే కాదని అన్నారు. బ్రహ్మ రాక్షసుడు ఆర్ఎస్ఎస్ అని ఆయన అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ ని వల్లభాయ్ పటేల్ నిషేధించారు, కానీ ఆయననే తమ సొంత నాయకుడిగా చెప్పుకుంటూ బీజేపీ మూడు వేల అడుగుల విగ్రహం పెట్టిందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. కర్ర పట్టుకుని తిరుగుతుంటారని ఆర్ఎస్ఎస్ కవాతుని కూడా ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ లో ఒక్క మహిళా సభ్యురాలు అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆడవాళ్ళను గౌరవించే సంస్థగా చెప్పుకుంటారు కదా ఎక్కడ అని నిలదీశారు. కొందరికి ఎన్ని ఏళ్ళు వచ్చినా బుద్ధి రాదని అలా ఆర్ఎస్ఎస్ కి వందేళ్ళు అయినా బుద్ధి రాలేదని ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అర్బన్ నక్సలైట్ ఆయన :

ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ ని అర్బన్ నక్సలైట్ అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం భీకరంగా సాగింది. తనపై విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సుదీర్ఘ విమర్శలకు ప్రకాశ్ రాజ్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వెంటనే రియాక్ట్ అయ్యారు.. కాలిందా అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శల మీద విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్పడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.

హెగ్డేవార్ పోరాడారు :

ఆర్ఎస్ఎస్ గురించి విమర్శలు చేస్తూ చరిత్రను వక్రీకరించడం కాదని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కి స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర లేదంటారా 1921లో జైలుకెళ్లిన డాక్టర్ హెడ్గేవార్ చరిత్ర తెలుసుకోండని గుర్తు చేశారు. పటేల్ ఆర్ఎస్ఎస్ ని నిషేధించినా ఆధారాలు లేవని తేలాక ఆయనే బ్యాన్ తొలగించారని ఆయన చెప్పారు ఇక ఆర్ఎస్ఎస్ లో మహిళలు ఎంతో మంది ఉన్నారని రాష్ట్ర సేవికా సమితి ఏకంగా 50 ఏళ్లుగా లక్షల మంది మహిళలతో పనిచేస్తోందని ఆయన చెప్పారు ఇక ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తోంది అని అంటున్నారని దేశంలో విపత్తుల సమయంలో ఎవరు సేవ చేస్తున్నారో ప్రకాష్ రాజ్ తెలుసుకోవాలని అన్నాఉర్. లక్షలాది కార్యకర్తలు, తమ ప్రాణాలు తెగించి మానవత్వంతో సేవ చేస్తుందని చెప్పారు.

అపుడు ఎందుకు ఖండించలేదు :

మావోయిస్టులు గురించి ఉపన్యాసాలు దంచుతున్న ప్రకాష్ రాజ్ 2000 నుండి 2025 వరకు మావోయిస్టుల దాడుల్లో సుమారు 2,722 మంది పోలీసులు చనిపోయారు మరి అప్పుడు ఎందుకు ఖండించలేదని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నేడు జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు నేతలే అడవిలో ఉన్న తోటివారి తుపాకులు హింసను ఆపమంటున్నారని ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్ లాంటి వారు వారిని రెచ్చగొడుతున్నారని కానీ ఆయన మాత్రం తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్లడం ఎందుకు వెళ్ళడంలేదని ప్రశ్నించారు. ఇక ప్రకాశ్ రాజ్ నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు కూడా మన ప్రజలే కదా అని అంటూ వారితో మాట్లాడి జనజీవన స్రవంతిలో కలపాలి కానీ హత్యలు చేయడమేంటి అని మండిపడ్డారు.

Tags:    

Similar News