వైసీపీకి నీలి నీడలు అంటే ఇవే మరి !
నిజానికి రాజకీయ పార్టీ అంటే దూకుడు ఉండాల్సిందే. కానీ అది హద్దులు దాటుతోంది. కూటమి పార్టీలు విమర్శించాయని కాదు కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నది కూడా విశ్లేషణగా ఉంది.;
వైసీపీని ఒక రాజకీయ పార్టీగా గుర్తించను అని ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అది చాలా తీవ్రమైన విమర్శగానే చూడాలి. ఎందుకు ఆయన అలా అన్నారు అంటే రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి విమర్శించారు అని లైట్ తీసుకుంటే పొరపాటే. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా ఉంటూనే అందులో దూకుడు చేసే వారు శృతి మించే వారు ఎక్కువ అన్నది ఆయన భావనగా ఉంది. రాజకీయ పార్టీ అంటే యాక్షన్ ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేసేవారు ఎక్కువగా ఉండడం సోషల్ మీడియాలో అతి ఉత్సాహంగా చేసే పోస్టులు ఆందోళనలు నిర్వహించినా వారు మితిమీరిన పోకడలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెబుతారు. నిజానికి రాజకీయ పార్టీ అంటే దూకుడు ఉండాల్సిందే. కానీ అది హద్దులు దాటుతోంది. కూటమి పార్టీలు విమర్శించాయని కాదు కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నది కూడా విశ్లేషణగా ఉంది.
రప్పా రప్పా నినాదాలు :
వైసీపీ మీద నేరస్థులకు కొమ్ము కాస్తూ ఆ ముసుగులో రాజకీయాలు చేసే పార్టీ అని ఇప్పటికే కూటమి పార్టీల నేతలు విమర్శిస్తూంటారు. రప్పా రప్పా అని నినాదాలు ఇవ్వడం మీద కూడా ఆ మధ్య పెద్ద చర్చనే సాగింది. అది సినిమా డైలాగ్ అని తేలికగా తీసుకుని వదిలేస్తే ఇపుడు జంతు బలులు కూడా చేస్తూ రప్పా రప్పా అంటున్నారని కూటమి నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. అధినేత జగన్ పుట్టిన రోజున కొంత మంది అతి ఉత్సాహవంతులైన కార్యకర్తలు పొట్టేళ్ళను తెగ నరికి సంబరాలు చేయడం మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం అయితే దీనిని సీరియస్ గానే తీసుకుంటోంది. రప్పా రప్పా అంటే అసలు ఉపేక్షించేది లేదని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రౌడీ రాజకీయాలను సహీంచేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హెచ్చరించారు.
తటస్తులలో సైతం :
ఏ రాజకీయ పార్టీ అయినా జనం నుంచే మెప్పు పొందలై తటస్థులు విద్యావంతులు ప్రతీ విషయాన్ని గమనిస్తూ ఉంటారు. అలాంటిది రప్పా రప్పా నినాదాలు చేస్తూ వైసీపీ ఏ విధంగా రాజకీయాలను ముందుకు తీసుకుని పోగలదని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అన్ని వర్గాల మద్దతు ఏ పార్టీకైనా అవసరం. ప్రజా సమస్యల మీద గట్టిగా మాట్లాడితే జనం మద్దతు దక్కుతుంది, కానీ వేరే విధంగా ఆవేశం చూపిస్తే మాత్రం అదే జనం నుంచి వేరేగా రియాక్షన్ వస్తుంది. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం కూడా క్యాడర్ ఉత్సహాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రప్పా రప్పా అన్నదే కొంప ముంచేలా ఉందని కూడా చర్చ సాగుతోంది.
అంతిమంగా నష్టమే :
వైసీపీ పేరుతో అనుచిత పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టినా లేక రోడ్ల మీదకు వచ్చి రప్పా రప్పా తరహా కార్యక్రమాలు చేపట్టినా కూడా అది అంతిమంగా వైసీపీకే చేటు తెస్తుందని అంటున్నారు. అధినాయకత్వం ఏమి చేస్తోంది అని కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు అంటే ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక చూస్తే జగన్ పుట్టిన రోజున ఏపీలో కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కుప్పం వంటి పదికి పైగా నియోజకవర్గాలలో ఒకే తరహాలో జంతు బలులు, రక్తాభిషేకాలు జరిగాయని హోం మంత్రి చెప్పుకొచ్చారు ఇదంతా వ్యవస్థీకృత నేరమేనని స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు మేకల తలలు నరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఎందిన శ్రేణులు ఎలాంటి తప్పులు చేసినా ఆ పార్టీ నాయకుడు జగన్ నోరు తెరిచి వాటిని ఎందుకు ఖండించడం లేదని అనిత తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ ఈ అతి పోకడలకు ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టించాల్సిన అవసరం అయితే ఉందని అంటున్నారు.