కర్ణాటక సర్కారుపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

అనూహ్య రీతిలో కేరళ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అదే సమయంలో కేరళ - కర్ణాటక రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చుకు తెర తీశాయి.;

Update: 2025-12-28 06:30 GMT

అనూహ్య రీతిలో కేరళ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అదే సమయంలో కేరళ - కర్ణాటక రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చుకు తెర తీశాయి. అసలు వివాదం ఎక్కడ మొదలైందన్న విషయానికి వస్తే.. రోటీన్ కు భిన్నంగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి స్పందిస్తూ సంచలన విమర్శలు చేశారు. యూపీలోని యోగి సర్కారు మాదిరి.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఇళ్ల మీదకు బుల్డోజర్లను పంపుతుందన్నారు.

దీనిపై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేరళ సీఎం చేసిన విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఇంతకూ కేరళ ముఖ్యమంత్రి కర్ణాటకలోని ఏ అంశంపై రియాక్టు అయ్యారు? అసలు వివాదం ఎక్కడ మొదలైందన్న విషయాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఫకీర్ కాలనీ.. వసీం లేఅవుట్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ముస్లిం ఇళ్లను తాజాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేసిందని పేర్కొంటూ.. ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కేరళ సీఎం ఒక పోస్టు పెట్టారు.

ఉత్తరప్రదేశ్ లోని సంఘ పరివార్ ప్రభుత్వం ఫాలో అవుతున్న మైనార్టీ వ్యతిరేక ధోరణి కర్ణాటకలోనూ కనిపిస్తుందన్న ఆయన.. కాంగ్రెస్ కపటత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తప్పుడు విధానాల్ని సెక్యులర్ శక్తులు ఏకమై ఎండగట్టాలి’ అంటూ పిలుపునిచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన తీవ్ర విమర్శలపై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఆయన తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

వాస్తవాలు తెలుసుకోకుండా కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.. కొందరు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివాసం ఉండటంతో తమ ఎమ్మెల్యేలు. అధికారులు వాటిని తొలగించినట్లుగా పేర్కొన్నారు. ‘విజయన్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఎవరైనా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమిస్తే వదిలేది లేదు. కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా విజయన్ రాజకీయ జిమ్మిక్కులు చేయటం సరికాదు. సీనియర్ నేత అయి ఉండి వాస్తవాల్ని తెలుసుకోకుండా మాట్లాడారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఏమైనా.. తనకు ఏ మాత్రం సంబంధం లేని రాష్ట్రాంలోని పరిణామాలపై కేరళ ముఖ్యమంత్రి రియాక్టు అవుతున్న తీరు చూస్తే.. ఎన్నికలా? మజాకానా? అన్న సందేహం కలుగకమానదు.

Tags:    

Similar News