స్టుపిడ్ పాలిటిక్స్: అమలాపురం గొడవకు.. మీరంటే మీరే కారణం!

Update: 2022-05-25 12:30 GMT
కోనసీమ జిల్లా పేరు మార్పుపై మే 24న అమలాపురంలో జరిగిన అల్లర్లు, తీవ్ర విధ్వంసానికి సంబంధించి ఆయా పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమలాపురంలో జరిగిన విధ్వంసానికి టీడీపీ, జనసేన పార్టీలు కారణమని అధికార వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తోంది.

ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేయడానికి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

మరోవైపు అమలాపురం అల్లర్లకు కారణం.. అధికార వైఎస్సార్సీపీయేనని టీడీపీ, జనసేన పార్టీలు విమర్శిస్తున్నాయి. జగన్ కు పరిపాలన చేత కాదని, శాంతిభద్రతలు రాష్ట్రంలో క్షీణించాయని నిప్పులు చెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాలకు, నేరాలకు అడ్డాగా మారిపోయిందని, శాంత్రిభద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.

అమలాపురం అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ఆ రెండు పార్టీలు మండిపడ్డాయి. ప్రభుత్వం తన చేతకాని తనాన్ని ప్రతిపక్ష పార్టీలపై చూపుతోందని విమర్శల దాడి చేశాయి. బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని, ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని ఆమెను కోరాయి.
Read more!

మరోవైపు వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ పార్టమెంటరీ పార్టీ నేత, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ విజయసాయిరెడ్డి కూడా తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే.. చంద్రబాబు అల్లర్లకు కుట్ర చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అంబేడ్కర్ లాంటి మహనీయుడి పేరు కోనసీమ జిల్లాకు పెట్టనీయకుండా చేస్తున్న చంద్రబాబును ప్రజలు, భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా పుట్టగతులు లేకుండా చంద్రబాబు పోతారన్నారు. చంద్రబాబు గ్యాంగ్ అమలాపురంలో అల్లర్లకు పాల్పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News