కరోనావేళ.. వాళ్లే మన సైన్యం

Update: 2020-04-04 11:10 GMT
కరోనా మహమ్మారి కాచుకూర్చుంది. అది విశృంఖలంగా విలయతాండవం చేస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో జనాలంతా ఇళ్లలోనే సుబ్బరంగా ఉంటున్నారు. అయితే మన కోసం ఈ కరోనా రక్కసితో పోరాడుతున్న వైద్యులు - సిబ్బంది - పోలీసులు... సామాజిక సేవ చేస్తూ వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు.

ముఖ్యంగా ఈ కరోనా రక్కసి వేళ జన సమూహాలను కట్టడి చేస్తూ కరోనా వ్యాపించకుండా కీలక పాత్ర పోషిస్తున్నారు మన పోలీసులు. రోడ్డెక్కిన పలువురి విషయంలో కఠినంగా ఉంటూ వారిని చావబాదడమే కాదు.. వారికి కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఇంటిపట్టునే ఉండేలా భయం చెబుతున్నారు. వినని వారికి బడిత పూజ చేసైనా దారికి తీస్తున్నారు. పోలీసుల ఆశయం ఒకటే.. మనకు కరోనా రావద్దని.. మన కోసం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి.

ఇక డ్యూటీ కోసం ఇంటిని - పిల్లలను వదిలి రోడ్లపై పడికాపులు కాస్తున్న పోలీసన్నలకు జనం కూడా కడుపులో పెట్టుకుంటున్నారు. వారికి భోజనాలు చేసి మరీ వడ్డిస్తున్నారు. తాజాగా రోడ్లపై పోలీసులు భోజనాలు చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.  తమ కర్తవ్య నిర్వహణలో ఎంత నిబద్ధతగా వ్యవహరిస్తున్నారో ఈ ఫొటోలతో ప్రపంచానికి చాటుతున్నారు.

కరోనా వేళ పోలీసుల సేవలకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కరోనా రక్కసి కబళించే అవకాశం ఉన్నా మొక్కవోని ధైర్యంతో రోడ్డున ఉండి.. కరోనా రోగులను తరలిస్తూ.. ప్రజలకు రక్షణ కల్పిస్తూ..నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఎదురొడ్డి నిలుస్తున్నారు. రోడ్లపైనే తింటున్నారు.. ఉంటున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో పోలీసుల సేవలు నిజంగా వెలకట్టలేనివి అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.
Tags:    

Similar News