ఏపీ ముందుకు ఇంకో రెండు స‌మ‌స్య‌లు

Update: 2016-08-06 06:54 GMT
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ ప్ర‌భుత్వానికి కీల‌క అంశాల్లో చుక్కెదురు అయింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణం - పోలవరం ప్రాజెక్టు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వివరణలకు ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించలేదు. దీనితో పోలవరం పర్యావరణ అనుమతుల పొడిగింపు - రాజధానికి అటవీభూముల కేటాయింపు చిక్కుల్లో పడనున్నాయి.

రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూములు కాకుండా - 13 వేల హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ - పర్యావరణశాఖను కోరింది. అయితే, నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వానికి అటవీ భూములు కేటాయిస్తే - దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడ అడవులు పెంచుతామన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకని, వాటితో ఏం చేస్తారో తమకు ప్రణాళిక పంపాలని కేంద్ర అటవీ సలహా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, ఇప్పటివరకూ దానికి జవాబు పంపించలేదని సమాచారం. ఒకవేళ తాము అటవీ భూములిస్తే, దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడ అటవీ భూములు పెంచుతారో వివరాలు పంపాలని కోరింది.

ఇక కీలకమైన పోలవరం ప్రాజెక్టు పురోగతిపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఫిబ్రవరి నుంచి పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడునెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ధర్నా చేసి, పనులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల పొడిగింపు అంశం అనుమానంగా మారింది. నిజానికి ఈ అనుమతులు జూలైతోనే ముగిసిపోయాయి. తిరిగి అనుమతి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ రెన్యువల్ ఇస్తుంది. దీనిపై ఇప్పటికే ఒడిశా - చత్తీస్‌ గఢ్ ప్రభుత్వాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం నిర్మాణానికి అనుమతులు ఇస్తే తమకు నష్టమని ఇటీవల రాజ్యసభలో ఒడిషా ఎంపిలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పర్యావరణ అనుమతులు వస్తే తప్ప - పోలవరం నిర్మాణం ముందుకు కదిలే పరిస్థితి లేదు. అనుమతులకు రెండు పొరుగు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెదేపా ప్రభుత్వం, చివరకు కేంద్రప్రభుత్వమే చేపట్టినా తమకు అభ్యంతరం లేదని చెప్పాల్సి వచ్చింది. ఇప్పటివరకూ పోలవరంపై తాము పెట్టిన సుమారు 5 వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
Tags:    

Similar News