పవన్ దెబ్బకు టీడీపీలో కోల్డ్ వార్

Update: 2016-08-30 07:35 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తంలో తిరుపతిలో సభ పెట్టాడో కానీ టీడీపీ నేతలు మాత్రం తలోరకంగా మాట్లాడుతూ పార్టీలోనే ఒకరి అభిప్రాయంతో ఒకరు విభేదిస్తూ అయోమయం సృష్టిస్తున్నారు. చివరకు టీడీపీ నేతలే ఒకరిపై విమర్శలు చేసుకుంటూ ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.  ఎంపీలను పవన్ నేరుగా టార్గెట్ చేయడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు పవన్ పై ఆగ్రహం వ్యక్తంచేయగా తాజాగా టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ కూడా పవన్‌ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజకీయాలంటే గడ్డం పెంచుకోవడం, దాన్ని గీయించుకోవడం కాదని.. పవన్ తన స్థాయేంటో తెలుసుకోవాలని అన్నారు. పవన్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి అమ్మేస్తే.. పవన్ పార్టీ పెట్టి ఇంతకాలం కుంభకర్ణుడిలా నిద్రపోయాడని టీజీ ఫైరయ్యారు. అశోక్ గజపతి రాజు వంటి నేతపై విమర్శలు చేసే స్థాయి పవన్ కు లేదని ఆయన మండిపడ్డారు.

అయితే... టీజీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  టీజీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ సంస్కృతిని టీడీపీలో చూపిస్తున్నారని బోండా ఉమామహేశ్వరావు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ విషయంలో పార్టీ అనుసరిస్తున్న విధానానికి కట్టుబడి ఉండాలని... నోటికొచ్చినట్లు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తేరాదని ఆయన టీజీకి సూచించారు. టీడీపీకి మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి నాయకుడు పార్టీతో సంబంధం లేకుండా తమకు తోచినట్లు మాట్లాడుతారని.. టీడీపీలో అలా కుదరని.. పార్టీ నిర్ణయం - క్రమశిక్షణను గౌరవించి మసలు కోవాలని ఆయన సూచించారు. అయితే.. టీజీ వ్యాఖ్యలపై బోండా ఉమ తప్ప మిగతా టీడీపీ నాయకులెవరూ స్పందించలేదు. అలాగే బోండా కూడా ఇంతకుముందు పవన్ పై విరుచుకుపడిన జేసీ దివాకరరెడ్డి విషయంలో కానీ, మిగతా ఎంపీలపై కాని విమర్శలు చేయలేదు. కేవలం టీజీని మాత్రమే ఆయన టార్గెట్ చేయడం వెనుక కారణాలు వేరే ఉన్నాయని వినిపిస్తోంది. మొత్తానికి పవన్ సభ దెబ్బకు టీడీపీలో ప్రచ్ఛన్న యుద్ధమేదో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News