యువత తరఫున పవన్‌ ప్రశ్నించారు

Update: 2015-07-11 22:37 GMT
ప్రశ్నించటానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ మధ్య కాస్తంత యాక్టివ్‌ అయ్యారు. అయితే.. ఆయన ఎప్పుడు టచ్‌లోకి వస్తారు.. మరెప్పుడు మాయమవుతారన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఎవరూ ఊహించని సమయాల్లో విపరీతంగా మాట్లాడేసే ఆయన.. అందరూ కోరుకున్నప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉంటారు. గత సోమవారం ప్రెస్‌మీట్‌ పెట్టేసి.. ఓటుకునోటు.. సెక్షన్‌ 8 లాంటి అంశాల మీద తన వాదనను వినిపించిన పవన్‌.. తదనంతరం పలుమార్లు ట్విట్టర్‌లో ట్వీట్స్‌ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారారు.

తన మీడియా సమావేశంతో తెలంగాణ.. ఏపీ రాష్ట్రాల అధికారపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేసి.. అటు తెలంగాణ అధికారపక్ష ముఖ్యనేతలకు.. ఇటు ఏపీ అధికారపక్ష ముఖ్యనేతలకు అసంతృప్తి మిగిల్చిన ఆయన.. ఏపీ ఎంపీలకు మాత్రం నిద్ర లేని రాత్రులు మిగిల్చారు.

ఎంపీలుగా ఏం పీకుతున్నారు? అన్న రేంజ్‌లో చెలరేగిపోయి ఏపీ ఎంపీల్ని ఉతికి ఆరేయటం తెలిసిందే. దీంతో.. మండిపోయిన కొందరు ఏపీ ఎంపీలు తమకు రోషం ఉందని.. ఆత్మాభిమానం తక్కువేం కాదన్నట్లుగా పవన్‌పై ఎదురుదాడికి దిగారు. పౌరుషం తన మీద కాదు.. కేంద్రం మీద చూపించాలని.. తనను తిడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అదేదో కేంద్రం మీద చూపించి.. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావాలంటూ ట్వీట్స్‌ చేసిన ఆయన.. శనివారం మాత్రం అందుకు భిన్నమైన ట్వీట్‌ చేశారు.

పవన్‌ మదిలో ఏం మెదిలిందోకానీ.. ఆయన యువతను ఉద్దేశించి తాజాగా ట్వీట్‌ చేశారు. సమాజాన్ని ప్రశ్నించినట్లుగా పవన్‌ ప్రశ్న ఉంది. ట్విట్టర్‌లో తన తాజా ట్వీట్‌లో.. యువరానికి ఏ సంపదలు విడిచాం.. యుద్ధం.. రక్తం.. కన్నీరు తప్ప అని వ్యాఖ్యానించిన పవన్‌.. ఆయాలు.. బాధలు.. వేదలు.. కలలు.. కల్లలు.. పిరికితనం.. మోసం తప్ప అంటూ తన మదిలో రేగుతున్న భావాల్ని పంచుకునే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాఖ్యలన్ని ఏ సందర్భంగా అన్నారు? ఎందుకివన్నీ ఇప్పుడే గుర్తుకు వచ్చాయన్న అంశంపై స్పష్టత లేనప్పటికీ.. తాను మిగిలిన రాజకీయ నేతలా కాదని.. కాస్తంత భిన్నమన్న మాటలు తాజా ట్వీట్‌ ద్వారా చెప్పకనే చెప్పినట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News