గాజా శాంతి మండలిలో భారత్ కు ఇన్విటేషన్.. ట్రంప్ పెద్ద ప్లానింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తినే ఏ పని చేయడు. చూసేందుకు తిక్కగా కనిపించే కొన్ని నిర్ణయాల వెనుక.. పక్కా ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి.;

Update: 2026-01-19 06:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తినే ఏ పని చేయడు. చూసేందుకు తిక్కగా కనిపించే కొన్ని నిర్ణయాల వెనుక.. పక్కా ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అమెరికాను మరింత బలోపేతం చేయటంతో పాటు.. మిగిలిన దేశాలు అగ్రరాజ్యానికి ఊడిగం చేసేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఏం చేసినా.. అమెరికా అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపించాలన్నది ఆయన ప్రయత్నం.

ఇదిలా ఉండగా గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ తాజాగా ఫోకస్ చేశారు. ఒక శాంతిమండలి ఏర్పాటు చేసిన ఆయన.. అందులో భారత్ కు చోటు కల్పిస్తున్నట్లుగా పేర్కొంటూ.. ఆహ్వానాన్ని పంపినట్లుగా తెలుస్తోంది. ఓవైపు తాను చెప్పినట్లుగా వినని భారత్ పై అదే పనిగా సుంకాల మోత మోగిస్తున్న ఆయన.. మరోవైపు తాను ఏర్పాటు చేసే శాంతి మండలిలో భారత్ కు చోటు కల్పించిన వైనం చూస్తే.. ఒక వ్యూహంలో భాగంగానే భారత్ కు చోటు కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది.

గాజా పాలనకు సంబంధించి రరెండు మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా అమెరికా ప్రకటించటం తెలిసిందే. ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనే శాంతి మండలిలో సాంకేతిక నిపుణులతో కూడిన ప్రధాన బోర్డుకు ట్రంప్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇక.. రెండోది ఎగ్జిక్యూటివ్ బోర్డు. సలహాదారుగా వ్యవహరించే ఈ బోర్డులోనూ తాను కోరుకున్నోళ్లకు పెద్దపీట వేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రెండు కీలక మండళ్లకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. అజయ్ బంగా.. టోనీ బ్లెయిర్ సహా పలు దేశాల ప్రతినిధులను ఎంపిక చేశారు. మరోవైపు తమ దేశానికి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదంటూ ఇజ్రాయెల్ అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. వైట్ హౌస్ డిసైడ్ చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యుల జాబితాను చూస్తే.. అందులో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.. వ్యూహాత్మక సభ్యులనే ఎంపిక చేసిన వైనం కనిపిస్తుంది

గాజాలో శాంతి.. స్థిరత్వం.. పునర్నిర్మాణం.. దీర్ఘకాలిక డెవలప్ మెంట్ పర్యవేక్షించేందుకు ఉద్దేశించినట్లుగా వైట్ హౌస్ చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బోర్డుకు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. బోర్డులోని సభ్యుల వివరాల్ని చూస్తే..

- అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

- బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్

- ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్

- ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా

- ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్

- అపోలో గ్లోబల్ మేనేజ్ మెంట్ సీఈవో మార్క్ రోవాన్

- అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ గాబ్రియేట్

- తుర్కియే విదేశాంగమంత్రి హకాన్ ఫిదాన్

- ఖతారీ దౌత్యవేత్త అలీ అల్ తవాడి

మరి.. ఇందులో భారత్ కు చోటు కల్పిస్తూ వైట్ హౌస్ ఎందుకు నిర్ణయం తీసుకుందన్న విషయానికి వస్తే.. అదంతా వ్యూహాత్మకమేనని చెప్పాలి. ప్రపంచ స్థాయిలో భారత్ కు ఉన్న విశ్వసనీయత.. సమతుల్య విదేశాంగ విధానం.. శాంతి ప్రయత్నాల్లో భారత్ వ్యవహరించే తీరు కారణంగానే ఎంపిక చేసినట్లుగా చెప్పాలి. మానవతా సాయం.. పునర్నిర్మాణం.. సంఘర్షణ నివారణకు సంబంధించిన చర్యలను ఈ బోర్డు కోఆర్డినేట్ చేస్తుంది. అయితే.. ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

ఈ బోర్డులో భారత్ భాగమైతే.. పశ్చిమాసియా శాంతి ప్రక్రియలో భారత్ పాత్ర మరింత బలోపేతం అయ్యే వీలుంది. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే వీలుందని చెబుతున్నారు. అందుకే.. భారత్ తొందరపాటుతో వ్యవహరించదన్న మాట వినిపిస్తోంది. తన నిర్ణయాన్ని చెప్పే ముందు అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవటంతో పాటు.. తమ ప్రతినిధి ఉండే పక్షంలో కొన్ని అంశాల్ని ప్రస్తావించే వీలుందన్న మాట వినినిస్తోంది. ఇదిలా ఉండగా..గాజా శాంతి బోర్డులో చేరేందుకు దేశాలు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలన్న మీడియా కథనాల్లో నిజం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. బోర్డులో చేరేందుకు కనీస రుసుము కూడా లేదని పేర్కొంది. శాంతి.. భద్రత విషయంలో నిబద్ధత చూపే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వాన్ని కల్పిస్తామని వైట్ హౌస్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.

Tags:    

Similar News