ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ?

మనిషి జీవితమే చాలా చిన్నది. అశాశ్వతమైనది. నిజంగా చూస్తే మనిషి పరిగెత్తి వెళ్ళినా నెమ్మదిగా సాగినా కాలం అయితే ఆగదు, దాని పని అది చేస్తుంది.;

Update: 2026-01-19 04:25 GMT

మనిషి జీవితమే చాలా చిన్నది. అశాశ్వతమైనది. నిజంగా చూస్తే మనిషి పరిగెత్తి వెళ్ళినా నెమ్మదిగా సాగినా కాలం అయితే ఆగదు, దాని పని అది చేస్తుంది. ఎవరికి ఎంత కాలం జీవితం ఉందో అది ముగిసిపోయాక ఎటూ ఈ జీవితం పరి సమాప్తం అవుతుంది. అలాంటి ఈ జీవితంలో ఎన్నో సార్లు చావు మాటలు మనిషి నోటి నుంచి వస్తాయి. అలా ఎందుకు అంటే అదే మనిషిని పట్టి పీడించే అతి పెద్ద మెదడు సమస్య కాబట్టి. కాస్తా జ్ఞానం వచ్చిన ప్రతీ వారి మనసులో చావు ఒక ముఖ్యమైన స్థానం ఆక్రమిస్తుంది. రేపు కాకపోతే మరో నాడు మనం కూడా ఈ లోకాన్ని వీడి పోవాల్సిందే కదా అని కూడా భావన ఏర్పడుతుంది.

అతి పెద్ద భ్రమలో :

నిరంతరం మనిషి ఆలోచనలలో ఎక్కడో ఒక చోట మరణ భయాలు అలా గూడు కట్టుకుని ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నంలో మనిషి చేసే విన్యాసాలు అనేకం ఉంటాయి. అలా భ్రమలో అబద్ధంలో జీవిస్తూ తనకేమీ కాదనే కృతిమ ధీమాతో లాగించేస్తూంటాడు. ఇది ఒక రకమైన తీరు అయితే ఆత్యహత్యలు చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఒక వైపు మరణం గురించి ఆలోచిస్తూ బతుకుతున్న జాబితా ఉంటే మరో రకం పంతంతో బతుకుతూ ఉంటుంది.

వెర్రి ఆవేశంతో :

వీరికీ సహజసిద్ధంగా చావు గురించిన చింతనలు ఉంటాయి. అయితే వీరి ప్రవర్తన చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతీ దానికీ అధికంగా ఆలోచిస్తారు అని మానసిక నిపుణులు చెబుతారు. వీరు పట్టుదలగా ఉంటారు. తాము కోరుకున్నది జరిగి పోవాలని కూడా ఆలోచిస్తారు. ఈ రకం వారు ఆత్మ హత్యలని మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటారు. ఎలాగైనా జీవితం ముగుస్తుంది కదా తాము కోరుకున్నది జరగకపోతే బతికి లాభమేంటని వీరు తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారు. అంతే కాదు వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చావుని వీరు గెలుపుగా భావిస్తారు, చచ్చి తాము సాధించామని అనుకుంటారు, తమ విలువ వారు తెలుసుకుంటారని కూడా అపోహ పడతారు, కానీ కాలం అన్నీ మరపిస్తుందని తేలిగ్గానే అంతా మరచిపోతారని అసలు ఊహించరు. అదే వీరు చేసే తప్పుడు ఆలోచనగా ఉంటుంది, చీర కొనలేదని, భర్త లేదా భార్య దెబ్బలాడారని, లేదా మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఇష్టమైన సినిమాకు వెళ్ళలేదని ఇలా చిన్న కారణాలతో ఆత్మహత్యను ఎంచుకుంటారు.

కార్నర్ అయిపోతారు :

ఈ ప్రపంచంలో ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉంటుంది. కానీ వెంటనే దొరకదు, దానికి సమయం పట్టవచ్చు. అలా కొందరు కార్నర్ లోకి నెట్టబడతారు. ఒక చీకటి గదిలో తాళం వేసిన తలుపుల మధ్యన దారీ తెన్నూ తెలియక వీరు కొట్టుమిట్టాడుతారు. ఆశ అనే చిరు దీపం వెలిగించుకోవాలన్న ఆలోచన వారికి ఆ సమయంలో తట్టదు, ఎందుకంటే మనసు ఆందోళనకరంగా ఉంటుంది. అన్ని విధాలుగా వారు కార్నర్ కి వెళ్ళిపోయామని భావిస్తారు, ఇక చావే శరణ్యం అనుకుంటారు. ఆ వైపుగానే ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మ హత్యకు దగ్గర మార్గాలు ఆలోచించే పనిలో పడతారు కానీ బతికేందుకు ఏ చిన్న వీలు ఉన్నా ప్రయత్నం చేద్దామని అసలు అనుకోరు, ఇలా బలహీన మనసుతో వీరు ఆత్మ హత్య చేసుకుని మరణిస్తారు.

జీవితంలో ఓడి :

కొంతమంది జబ్బులు పడి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలు అయి పరువు పోయి ఏ మార్గం లేదనుకుని ఆత్మహత్యలకు తెగిస్తారు. తాము చనిపోతేనే హాయి అన్న నిర్ధారణకు వస్తారు. బతికి ఉండడం వీరికి భారంగా తోస్తుంది. ఇలా పదే పదే ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఆ దిశగానే అడుగులు వేస్తూ మరణాన్ని ఉరి కొయ్య ద్వారా అహ్వానిస్తారు. అయితే ఆత్మ హత్యలు అన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఆత్మ న్యూనతా భావం. తాము ఈ లోకంతో కలసి ముందుకు సాగలేమని తాము ఎక్కడో ఆగిపోయామని తాము తక్కువగా చూడబడుతున్నామని తాము దుర్బలులమని ఏమీ చేయలేని చేతగాని వారమని ఇక ఈ లోకంతో తమకు అవసరం తీరిపోయిందని ఇలా అనవసరమైన భావజాలాన్ని మెదడు నిండుగా నింపుకుని మరణిస్తారు. చిత్రమేంటి అంటే ఇలా ఆత్మహత్యలకు ప్రయతంచి విఫలం అయిన వారు కనుక మరోసారి ఈ లోకంలోకి వచ్చి చూస్తే తాము చేసింది తప్పే అని అంగీకరిస్తారు. అయితే ఈ మానసిక దౌర్బల్యాన్ని జయించడం చాలా కష్టమే. అదో రకమైన మానసిక వ్యాధిగానూ పరిణమించి ఆత్మహత్యలకు దారి తీస్తుంది అని చెప్పాలి.

లక్షల్లోనే ఆత్మహత్యలు :

ఇదిలా ఉంటే భారతదేశంలో ఏటా 1,70,000 కంటే ఎక్కువ ఆత్మహత్యలు నమోదవుతున్నాయి, ఎన్ సీ ఆర్ బీ డేటా ప్రకారం చూస్తే 2023లో 1,71,418 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి , ఇది 2022లో 1,70,924 నుండి పెరిగింది, కుటుంబ కలహాలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ ఆత్మ హత్యలలో 18 నుంచి 30 ఏళ్ళ మధ్యన ఉన్న యువత 30 నుంచి 45 మధ్య వయసు కలిగిన వారే మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. ఇక 2023లో 13,000 కంటే ఎక్కువ మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News