బాబు కోసం.. పాదయాత్ర షురూ చేసిన బండ్ల గణేష్.. నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు

నటుడు నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టడం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-01-19 04:58 GMT

నటుడు నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టడం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన సందర్భంలో ఆయన త్వరగా క్షేమంగా బయటకు రావాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించి షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని బండ్ల గణేష్ తెలిపారు. ఆ మొక్కును నెరవేర్చేందుకే ఈనెల 19న ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ‘సంకల్ప యాత్ర’ను ప్రారంభించినట్లు ప్రకటించారు.

వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో తనలో కలిగిన ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ వివరించారు. “కోట్లాది మందికి సేవ చేసిన వ్యక్తిని అన్యాయంగా జైలుకు పంపినట్టు అనిపించింది. అందుకే దేవుడిని వేడుకుని మొక్కుకున్నా” అని ఆయన పేర్కొన్నారు.

శివాజీ మద్దతు వ్యాఖ్యలు

బండ్ల గణేష్ పాదయాత్రపై నటుడు శివాజీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యాత్ర ప్రారంభంలో పాల్గొన్న నటుడు శివాజీ “ఒక సామాన్యుడిగా వచ్చి బ్రాండ్‌గా ఎదిగిన గణేష్ చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని కోరుకుని ఈ సాహసోపేత యాత్ర చేపట్టాడు. 32 ఏళ్ల స్నేహబంధాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. గణేష్ ఎప్పుడూ తనను నమ్మిన వారిని వదలడు” అని కొనియాడారు.

అరెస్టు సమయంలో టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం సన్నగిల్లకుండా పోరాట పటిమ నింపేందుకు గణేష్ చేసిన ప్రసంగాలు ఎంతో మందికి ప్రేరణనిచ్చాయని శివాజీ గుర్తు చేశారు. “చంద్రబాబు గారు గణేష్ కోసం వ్యక్తిగతంగా ఏమీ చేయకపోయినా న్యాయం పట్ల ఉన్న నమ్మకంతోనే ఆయన బయటకు వచ్చి తన గళం వినిపించాడు” అంటూ శివాజీ వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజకీయాలు.. సినిమాలు.. బండ్ల గణేష్ ప్రయాణం

కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో జనసేన తరఫున డిబేట్లలో పాల్గొని గట్టిగా వాదించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో సీటు ఆశించినా అది నెరవేరలేదు. దీంతో రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యాపారాలపై దృష్టి పెట్టిన గణేష్, ఇటీవలే మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు తిరుమల పాదయాత్రతో రాజకీయాల్లోనూ గ్రాండ్ రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారన్న చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ యాత్ర వెనుక ఏదైనా రాజకీయ ఆశయం ఉందా? లేక పూర్తిగా మొక్కు చెల్లింపేనా? అన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు “ఏ లాభం ఆశించకుండా ఇంత పెద్ద పాదయాత్ర సాధ్యం కాదేమో” అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం “ఇది పూర్తిగా భక్తి.. నమ్మకంతో చేసిన యాత్ర”గా అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా బండ్ల గణేష్ సంకల్ప యాత్రకు లభిస్తున్న స్పందనతో పాటు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి. తిరుమల చేరుకున్న తర్వాత పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News