వాళ్ల సాయం లేకుంటే పవన్ కు గడ్డు రోజులే!

Update: 2018-05-09 05:51 GMT
‘మేం ఏపీలో 175  స్థానాల్లోనూ పోటీచేయబోతున్నాం’ అనే మాటను పట్టుకుని కొందరు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ ఒంటరిగానే పోటీచేయబోతున్నది అనే అర్థాలు తీస్తున్నారు. అయితే ఆ మాట చెప్పడం వెనుక పవన్ కల్యాణ్ ఉద్దేశం.. జనసేన మరియు వాపక్షాలతో కలిసిన కూటమి అన్నిస్థానాలకు పోటీచేస్తుందని మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. పవన్ ప్రకటన తర్వాత కొన్నిరోజులకు సీపీఐ రామకృష్ణ.. తాము కూటమిగా పోటీచేయనున్నట్లు చేసిన ప్రకటన గురించి పవన్ ప్రమేయం లేకుండా చేసిన ప్రకటనగా కొన్ని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే అది కూడా నిజం కాదని.. ఇరువురి ప్రకటన భావం ఒకటే అని.. కూటమిగానే అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. జనసేనతో కలిసి పోటీచేయడం వలన వామపక్షాలకు లాభం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం రాష్ట్రంలో ఒకటిరెండు స్థానాల్లో అయినా వారు ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ వామపక్షాల సాయం లేకపోతే పవన్ కల్యాణ్ కుమాత్రం గడ్డు రోజులు తప్పవు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కూడా సహేతుకమైన కారణాలు ఉన్నాయి.

పవన్ కల్యాణ్ కు క్షేత్రస్థాయిలో నెట్ వర్క్ లేదు. ప్రత్యేకించి ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం అంటే.. సభల ప్రసంగాల్లో చప్పట్లు, విజిల్స్ కొట్టించుకున్నంత ఈజీకాదు. బూత్ కమిటీల స్థాయి వరకు అంతా పటిష్టంగా ఉంటే తప్ప... ఓట్లు రాలవు. ఇప్పటిదాకా రాష్ట్ర కమిటీకే జనసేన పార్టీలో అతీగతీ లేదు. అలాంటిది.. వారి సరికొత్త పంచాయతీలను చక్కబెట్టుకుంటూ.. రాష్ట్ర కమిటీ - జిల్లా కమిటీ... కిందిస్థాయిలో బూత్ కమిటీ వరకు వారు సంస్థాగత నిర్మాణం చేపట్టడం అనేది అంత సులభమూ కాదు.. అందుకే వారు వామపక్షాలకు ఉన్న నెట్ వర్క్ ను వాడుకుని.. ఈసారికి తమ అవసరం గడుపుకోవాలని చూస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వామపక్షాలను విస్మరించి.. పవన్ ఒంటరిగా 175 స్థానాలకు పోటీచేస్తారని అనుకోవడం భ్రమ.

కాకపోతే... పవన్ కల్యాణ్ తీరులో ఒక్క సంగతి మాత్రం అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని పలువురు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఒక స్థాయిలో ఉద్యమిస్తున్నాయి. ఆ ఉద్యమాలలో మాత్రం పవన్ భాగం పంచుకోవడం లేదు.. కేంద్రాన్ని ఇరుకున పెట్టే పెట్రోధరల పెంపు వంటివి పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి అనుమానాలు ముదిరితే... వీరి కూటమి బంధం ఎంతదూరం మనగలుగుతుందో కూడా తెలియదు.  
Tags:    

Similar News