పవనే రాజకీయ మొనగాడు...ఉండవల్లి మాట ఇది

Update: 2023-04-01 21:32 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కడు నమ్మకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా 2024లో మాత్రం అలా జరగదని ఆయన అంటున్నారు. ఈ మధ్యన రెండు మూడు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఉండవల్లి పవన్ మీద పూర్తి విశ్వాసం కనబరచారు.

పవన్ గత ఎన్నికల్లో ఓడారని తేలికగా తీసుకుంటే మాత్రం ప్రత్యర్ధులు దెబ్బ తిన్నట్లే అంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఆరు శాతం ఓట్లు వచ్చాయని అయితే ఇపుడు ఆ పరిస్థితి లేదని ఆయన చెబుతున్నారు. అవి పన్నెండు శాతం దాకా ఇప్పటికే పెరిగిందని, ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ ఆ బలం కాస్తా పదిహేను శాతానికి అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఉత్తారాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ బలం బాగా పెరిగిందని ఉండవల్లి చెబుతున్నారు. ఏపీ జనాలకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం బాగా కనిపిస్తోందని ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుంటే వైసీపీ దారుణంగా ఓడిపోతుందని ఉండవల్లి అంటున్నారు.

అయితే ఈ పొత్తుల విషయంలో ఏమి చేయాలన్నది నరేంద్ర మోడీ చేతులలోనే ఉందని ఆయన చెప్పారు. మోడీ కనుక జగన్ని ఓడించకూడదు అనుకుంటే కచ్చితంగా టీడీపీ నుంచి పవన్ని విడదీస్తారని, పొత్తులు కుదరనీయరని అంటున్నారు. అలా కాకుండా జగన్ తో పనేంటి అనుకుంటే మాత్రం టీడీపీ జనసేనలను కలపడమే కాదు బీజేపీ కూడా సై అంటుందని తనదైన అంచనాలు చెప్పుకొచ్చారు.

అందువల్ల ఏపీలో పొత్తుల విషయంలో అసలైన    రాజకీయ  ఆట ఆడేది కేంద్ర బీజేపీ నాయకత్వమే అని ఉండవల్లి అంటున్నారు. మొత్తానికి పవన్ కి ఏపీలో మాత్రం మంచి ప్రాధాన్యతే ఉంటుందని ఆయన చెబుతున్నారు. అదే విధంగా చూసుకుంటే ఏపీలో పవన్ రాజకీయ మొనగాడుగా నిలబడతారు అని ఉండవల్లి జోస్యం చెబుతున్నారు.

ఇక ఏపీలో పొత్తుల విషయంలో జనసేన అధినేత ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదని అంటున్నారు. అయితే జనసైనికులు మాత్రం పొత్తులు ఎన్నికల వేళకు అయినా కచ్చితంగా ఖరారు అవుతాయన్న భరోసాతో పనిచేసుకుని పోతున్నారు. ఏది ఏమైనా ఉండవల్లి వంటి రాజకీయ విశ్లేషకుడు, అనుభవం కలిగిన వారు అంచనా వేశారంటే అది నిజం అవుతుంది అని అన్న వారే ఎక్కువగా ఉన్నారు.

ఇక ఉండవల్లి వారి జోస్యాన్ని విని జనసైనికులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. తమకు ఇక మీదట తిరుగులేదని, ఏపీ రాజకీయాల్లో పవన్ మార్క్ ఈసారి స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఎందరు పొత్తులు పెట్టుకుని వచ్చినా సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే వారి ధీమా ఏంటో ఆలోచించాల్సి ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News