గ‌వ‌ర్న‌ర్ కేంద్రంగా ప‌న్నీర్ వ్య‌తిరేక వ‌ర్గం స్కెచ్‌

Update: 2017-04-21 12:13 GMT
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలోనీ రెండుగా చీలిక గ్రూపులు ఒక్కటయ్యేందుకు చర్చలు జరగనున్న నేపథ్యంలో అంతర్గత రాజకీయాలు వరుస 'భేటీ'లతో వేడెక్కాయి. తాజాగా ఈ భేటీ తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు కేంద్రంగా సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. అన్నాడీంఎకే సీనియర్‌ నేతలు కొంద‌రు గ‌వ‌ర్న‌ర్‌ తో భేటీ కాగా, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్‌ తన మద్దతుదారులతో తన స్వగృహంలో చర్చలు జరిపారు. మరోవైపు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం గ్రీన్‌ వే రోడ్డులోని స్వగృహంలో భవిష్యత్తు కార్యాచరణపై తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

అన్నాడీఎంకె పార్లీమెంటరీ పార్టీ నేత ఎం.తంబిదురై, మరో నేత జయరామ్‌ లు గవర్నర్ అండ‌తో ప‌ళ‌నిస్వామి సీఎం పీఠం కాపాడేందుకు ఎత్తులు వేస్తున్న‌ట్లు స‌మాచారం.  ఇందులో భాగంగానే తంబిదురై భేటీ అయినట్లు స‌మాచారం. తమిళనాడు సీఎంగా పళనిస్వామినే కొనసాగించాలని తంబిదురై నొక్కి చెప్పారు. తన వాదనకు మద్దతుగా ''అలా చేస్తేనే మరో నాలుగు నెలల వరకూ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ప్రతిపక్షాలకు ఉండదు'' అనే కారణాన్ని చెప్పినట్లు సమాచారం. పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడి ఆగస్టు 18 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. ఒక వేళ సీఎంను మారిస్తే డీఎంకే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. అంతర్గత విభేదాలు అధికారాన్ని పార్టీ నుంచి దూరం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే తన భేటీపై వస్తున్న వార్తలను తంబిదురై ఖండించారు. 1998 నుంచే విద్యాసాగర్‌ తనకు మిత్రుడనీ, స్నేహపూర్వకంగానే తనను కలిశాననీ ఆయన చెప్పుకొచ్చారు. కానీ గవర్నర్‌ తో భేటీ అనంతరం ఆయన నేరుగా ముఖ్యమంత్రిని కలవడానికి సెక్రటేరియట్‌ కు వెళ్లడం విశేషం. అనంతరం జయకుమార్‌ గవర్నర్‌ తో భేటీ అయ్యారు. తూత్తుకుడిలోని మత్య్స శాస్త్ర యూనివర్శిటీకి ఉపకులపతిని నియమించే అంశంపై చర్చించారు. ప్రస్తుత రాజకీయాంశాలపై తాను ఏమీ మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News