మంత్రులకు కొత్త కార్ల ప్రసాదం

Update: 2017-03-05 05:09 GMT
మొన్నటి వరకూ తమిళనాడులో సాగిన రాజకీయ సంక్షోభం.. బలపరీక్షతో ఒక కొలిక్కి రావటం తెలిసిందే. బలపరీక్ష జరిగిన తీరుపై విపక్షాలు.. ఇతర వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉండటం.. కోర్టుల్లో కేసులు దాఖలు చేయటం లాంటివి ఓపక్క చేస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా తన పని తాను అన్నట్లుగా సాగిపోతున్నా తమిళనాడు చిన్నమ్మ విధేయుడు ఎడపాడి పళనిస్వామి. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాల అమలుపై దూకుడు ప్రదర్శిస్తున్న ఆయన.. పలు నిర్ణయాల్ని ఎడాపెడా తీసేసుకుంటున్నారు.

పాలన మీద పట్టు సాధించేందుకు పలు ప్రయత్నాలు చేయటంతో పాటు.. పలువురు కీలక అధికారుల్ని స్థానచలనం కలిగించటం ద్వారా.. అధికారం మొత్తం హస్తగతమయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా.. తన మంత్రివర్గంలోని మంత్రులందరికి కొత్త కార్లను ప్రసాదంగా ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొత్త కార్లను వాడుతున్న మంత్రులకు.. అవి సరిపోవన్నట్లుగా మళ్లీ కొత్త కార్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవటంతో పాటు.. రూ.6కోట్ల ఖర్చుకు సిద్ధమైన పళనిస్వామి తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన నిర్ణయంపై పలువురు విమర్శలు చేస్తున్నా.. ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా ఉండటం గమనార్హం.
Read more!

మంత్రులతో పాటు.. అధికారులకు కూడా కొత్త కార్ల సౌకర్యాన్ని కల్పించటం ఒక ఎత్తు అయితే.. కొత్త కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు అయిన 9999.. 6666.. 9000 లాంటివి ఎంపిక చేస్తున్న వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అందరి మనసుల్ని దోచుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. పాలనలో తన మార్క్ ను ప్రదర్శించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తుండటం గమనార్హం. అమ్మ జయలలిత.. ఆమె విధేయుడు పన్నీర్ సెల్వంలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ వేదికగా వీడియో కాన్ఫరెన్స్ లు జరిగేవి. తాజాగా ఆ వేదికను మార్చేయటం పళనిస్వామి తీరుపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించే విషయంలో తమకెలాంటి అభ్యంతరాలు లేవన్న విషయాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు సీఎం పళనిస్వామి. కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న జీఎస్టీకి తమ సర్కారు పూర్తిగా అనుకూలమన్న విషయాన్ని తాజాగా జరిగిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమావేశంలో ఓకే చెప్పేసిన పళనిస్వామి టీం.. కేంద్రానికి తమ ప్రభుత్వం ఎంత స్నేహపూర్వకంగా ఉండనుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెబుతున్నారు.
4

పాలన మీదా.. అధికారుల మీదా పూర్తి స్థాయి పట్టునుపెంచుకునే క్రమంలో ఇప్పటివరకూ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అపూర్వ వర్మపై బదిలీ వేటు వేసి.. ఆయనస్థానంలో నిరంజన్ మార్టన్ ను తీసుకున్నారు. అదే సమయంలో అపూర్వ వర్మను ఏ మాత్రం ప్రాధాన్యం లేని పర్యాటక.. దేవాదాయ శాఖకు బదిలీ చేయటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైనట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News