ఒమిక్రాన్ పంజా.. 38 దేశాల్లో గుర్తింపు!

Update: 2021-12-04 09:48 GMT
కరోనా మహమ్మారి... కొత్త వేరియంట్లతో దశలుగా విజృంభిస్తోంది. భారతదేశంలో రెండు దశలుగా పంజావిసిరిన వైరస్.. మూడో ముప్పు కూడా రాబోతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

రెండో వేవ్ లో డెల్టా పేరుతో వచ్చిన వేరియంట్ చాలా ప్రమాదకరం అనే విషయం తెల్సిందే. అతివేగంగా వ్యాప్తి చెందింది. అందుకే గత మార్చి, ఏప్రిల్ లో మహమ్మారి మరణ మృదంగం మోగించింది. ఇకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంతకన్నా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్... క్రమంగా అన్నిదేశాలకు ఎగబాకింది. అతిప్రమాదకరమైన ఈ వేరియంట్ పట్ల పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.

అయినా కూడా ఇప్పటివరకు 38 దేశాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాకాపోతే ఈ వేరియంట్ బారిన పడి ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని డబ్ల్యూహెచ్ వో టెక్నికల్ హెడ్ మారియా వాన్ ఖేర్ కోవ్ ప్రకటించారు. కొవిడ్ ప్రస్తుత పరిస్థితిపై ఓ నివేదికను విడుదల చేశారు.

కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినా కూడా 38 దేశాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. డెల్టా కన్నా అతిప్రమాదకరంగా జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందుతున్న దీనిని కట్టడి చేయడానికి పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.

ఇప్పటికే కొన్ని దేశాలు ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఈ డేంజరస్ వేరియంట్ బారిన పడి... ఇప్పటివరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని డబ్ల్యూహెచ్ వో ప్రకటించడం ఊరట కలిగించే విషయమే.

ఒమిక్రాన్ పట్ల భారత్ కూడా అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టినా కూడా మనదేశంలో ఒమిక్రాన్ అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది.

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై ప్రత్యేకమైన నిఘా పెట్టింది. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా ఈ వేరియంట్ ను కట్టడి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మూడో ముప్పును అడ్డుకునేవిధంగా చర్యలు చేపడుతున్నాయి.

విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఏది ఏమైనా మరికొన్నాళ్ల పాటు అందరూ కరోనా నిబంధనలను స్ట్రిక్ట్ గా ఫాలో అవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు పాటిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News