అంబటి కాపు టైగర్ : వైసీపీ నయా వ్యూహం

చాలా మంది చాలా రకాలుగా జగన్ గురించి ఆయన రాజకీయ ఆలోచనల గురించి విశ్లేషణలు చేస్తున్నారు, కానీ జగన్ అందరి విశ్లేషణలకు మించి ఎక్కువగానే తన మాస్టర్ ప్లాన్స్ ని రెడీ చేస్తున్నారు అనుకోవాలి.;

Update: 2026-02-05 07:37 GMT

వైసీపీ అధినేత జగన్ 2029 గెలుపు దారులను వెతుకుతున్నారు. చాలా మంది చాలా రకాలుగా జగన్ గురించి ఆయన రాజకీయ ఆలోచనల గురించి విశ్లేషణలు చేస్తున్నారు, కానీ జగన్ అందరి విశ్లేషణలకు మించి ఎక్కువగానే తన మాస్టర్ ప్లాన్స్ ని రెడీ చేస్తున్నారు అనుకోవాలి. రాజకీయాల్లో పోయిన చోటనే వెతుక్కోవడం ఒక రివాజు. జగన్ కూడా అదే పని చేస్తున్నారు. దానికి ఆయన పాత పద్ధతులు కాకుండా నయా వ్యూహాలను నమ్ముకుంటున్నారు. వైసీపీ ఓటమికి దారి తీసిన రాజకీయ సామాజిక పరిణామాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అన్నది ఆయన మీడియా ప్రసంగాలను చూస్తే అర్ధం అవుతోంది.

అంబటిని అక్కడ పెట్టి :

మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత. ఎవరికీ సందేహం లేదు, అయితే ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనదిగా ఉన్నా గెలిచింది మాత్రం రెండే రెండు సార్లు ఆయన కంటే జూనియర్లు ఎంతో మంది మంత్రులు అయినా అంబటిని మంత్రి పదవి వరించింది మాత్రం జగన్ హయాంలో 2022లో మాత్రమే. అంటే మినిస్టర్ రాంబాబు అనిపించుకోవడానికి మూడున్నర దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. అంబటి వైఎస్సార్ అనుచరుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లో కొనసాగారు. ఆయన బ్యాడ్ లక్ అనాలో మరేమో కానీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దాంతో ఆయన రాజకీయం అంతగా దూకుడుగా సాగలేదు. వైసీపీలో మాత్రం ఆయనకు జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఇపుడు ఏకంగా కాపులలో టైగర్ అని ఒక బిరుదు కూడా ఇచ్చేశారు.

వారిని ఆకట్టుకోవడానికే :

జగన్ అయితే కాపు సామాజిక వర్గం మీద ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 2019లో వైసీపీ గెలుపు వెనక వారు ఉన్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కూడా కలిసి వచ్చింది. గోదావరి జిల్లాలలో ఫ్యాన్ గిర్రున తిరిగింది. కానీ 2024 వచ్చేసరికి సీన్ మారింది. పవన్ రూపంలో బలమైన నాయకుడు కాపులకు దొరికారు. పైగా చంద్రబాబుతో జట్టు కట్టడంతో గోదావరి తీరంలో వచ్చిన రాజకీయ సునామీకి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఇక ముద్రగడనే నమ్ముకుని వైసీపీ మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఇంతలో అనూహ్యంగా అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగింది. దాంతో జగన్ అంబటిని కాపు టైగర్ అని కీర్తించారు. ఆ విధంగా కాపులను కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోంది అన్నది ఇండైరెక్ట్ గా సందేశం పంపించారు.

మౌనిక కామెంట్స్ :

జగన్ కంటే ముందు అంబటి కుమార్తె మౌనిక అయితే మీడియాతో మాట్లాడుతూ మా వేలితో మా కన్ను పొడుస్తారా అని కూటమి పెద్దలను ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాపుల మీద దాడి అంటూ ఆమె తన తండ్రి మీద జరిగిన దాడిని చిత్రీకరించారు. అదే విధంగా జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తమ మీదనే అధికార ప్రతాపం చూపిస్తుందా అని ఒక స్ట్రైట్ క్వశ్చన్ నే ఆమె సంధించారు. ఇది కూటమి పెద్దలకు ఎంత వరకూ చేరుతుందో కానీ కాపు సామాజిక వర్గంలో ఆలోచనలు రేకెత్తించడానికే ఆమె ఈ విధంగా మాట్లాడారు అన్నది విశ్లేషణగా ఉంది. దానికి తగిన ప్రతిస్పందన కూడా గుంటూరు జిల్లాలో జగన్ టూర్ సందర్భంలో కనిపించింది. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారంతా బాగానే రెస్పాండ్ అయ్యారు అన్నది కూడా అగుపించిన దృశ్యం గా ఉంది అంటున్నారు.

పోలరైజ్ చేయగలరా :

అంబటి రాంబాబు రేపటి రోజున బలమైన తన సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేసి వైసీపీ వైపుగా నడిపించగలరా అన్నది కూడా చర్చగా ఉంది. మాట్లాడుకోవాల్సి వస్తే అంబటి వంగవీటి రంగా అనుచరుడిగా కూడా ఉన్నారు. ఆయన యువ నేతగా ఉన్నపుడు కాపునాడు వ్యవహారాలలో గట్టిగానే పనిచేశారు. అయితే అంబటి మీద ఈ ముద్ర అయితే వైసీపీలో ఉన్నపుడు పెద్దగా లేదు, కానీ ఇపుడు వైసీపీ ఆయనను ముందు పెడుతోంది. అంబటి రేపటి రోజున జైలు నుంచి విడుదల అయ్యాక మరింతగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఎటూ కూటమి వర్సెస్ రాంబాబు ఎపిసోడ్ మరింత వేడిగా వాడిగా ఫ్యూచర్ లో సాగనుంది. దాంతో జగన్ వ్యూహాత్మకంగానే అంబటిని కాపుల టైగర్ అనేశారు. ఒక విధంగా ఇది వైసీపీ వేసిన ఎత్తుగడ అయితే కూటమి ఏ విధంగా పై ఎత్తు వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News