ఇప్పటిదాకా పడ్డ ఇబ్బందులు చాలు.. వైసీపీ ఎమ్మెల్యేకి గ్రామస్తుడి షాక్‌!

Update: 2022-11-29 07:30 GMT
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175కి 175 సీట్లు సాధించాలనే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద లక్ష్యాన్ని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, దిగువ స్థాయి నేతలకు అందరికీ చెబుతున్నారు.

తన లక్ష్యసాధనలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్తున్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలు వివరిస్తున్నారు. మరోసారి వచ్చే ఎన్నికల్లో తమకే ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

అయితే గ్రామస్తుల నుంచి కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ ఎదురవుతోంది. ఎన్నికల్లో గెలిచిన నాలుగేళ్ల తర్వాత తాము గుర్తొచ్చామా అని ప్రజలు నిలదీస్తున్నారు. రోడ్లు బాలేదని, డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, కొన్ని సంక్షేమ పథకాలు అందట్లేదని, ఇల్లు రాలేదని ఇలా పలు సమస్యల గురించి ఏకరవు పెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయన ఓగూరులో 'గడపగడపకు మన ప్రభుత్వం'లో స్థానిక వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్తుడు పి.రఘు ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

పథకం సరిగా వస్తే సరే.. లేదంటే అవసరం లేదు అంటూ రఘు తన ఇంటి గేటు వేసుకున్నారు. దీంతో 'నీకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదా?' అని వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ప్రశ్నించారు. 'మీ ద్వారా మేము పడిన ఇబ్బంది చాలు' అని రఘు ఎమ్మెల్యేకు షాకిచ్చారు. 'ఇబ్బంది పడి ఉంటే మంచిది' అంటూ ఎమ్మెల్యే సైతం అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

అలాగే తన భర్త చనిపోయినా తనకు పింఛను రావటం లేదని ధన్యాసి గోవిందమ్మ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని నిలదీశారు. రైతుభరోసా కూడా అందటం లేదన్నారు.

అదేవిధంగా అమ్మఒడి మూడో విడత నిధులు ఇవ్వలేదని, ఇచ్చినట్లు పత్రాల్లో మాత్రం చూపుతున్నారని గ్రామస్థుడు వై.మల్లికార్జున ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. సమస్యలు పరిష్కరిస్తామంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News