మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి ఆఫీస్ స్పేస్!

Update: 2022-07-01 02:30 GMT
హైదరాబాద్.. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలకు అనువుగా మారింది. అందుకే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే గూగుల్, అమేజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు మరెన్నో సంస్థలు తరలివస్తున్నాయి. అంతర్జాతీయ నగరంగా భవిష్యత్ లో హైదరాబాద్ రూపుదిద్దుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు

 హైదరాబాద్ ఇప్పటికే అరుదైన ఫీట్ సాధించింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో బెంగళూరును వెనక్కి నెట్టి ముందు వరసలో నిలిచింది. ఈ పరిణామం హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింప చేస్తోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్ లో అద్దెకిచ్చిన ఆఫీస్ స్పేస్ పెరగడం కూడా మంచి పరిణామమని సీబీఆర్ఈ నివేదకలో పేర్కొంది.

దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరిగింది. 1.28 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక కారిడార్లు వంటి దేశీయ, బహుళజాతి కార్పొరేట్ల కార్యకలాపాలు పుంచుకోవడానికి ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు.

ఈ జనవరి నుంచి మార్చి వరకు హైదరాబాద్ లో స్పేస్ లీజింగ్ 35 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో కేవలం 11లక్షల చదరపు అడుగులుగా మాత్రమే ఉంది.

అంటే మూడింతలు పెరగడం విశేషం. తాజాగా జూన్ వరకు హైదరాబాద్, బెంగళూరు రెండు నగరాల్లో ఆఫీస్ స్పేస్ 2.45 కోట్ల చదరపు అడుగులకు లీజుకు ఇస్తున్నారు. పెరుగుతున్నడిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని బిల్డర్లు పెద్ద ఎత్తున కొత్త నిర్మాణాలు చేపడుతూ లబ్ధి పొందుతున్నారు.

ఇక హైదరాబాద్ నగరంలోని కార్యాలయాలే కాదు.. మెట్రో స్టేషన్లలో కూడా ఆఫీస్ స్పేస్ లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ఆఫీసులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో మొత్తం 49 స్టేషన్లలో 1750 చదరపు అడుగుల మేర 2 యూనిట్లు.. మిగిలిన 8 స్టేషన్లలో 5000-30000 చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకోవచ్చని సమాచారం.
Tags:    

Similar News