రాహుల్ ఎన్ని పేలినా..ఆయన నమ్మిందే చేశాడు!

Update: 2017-07-28 06:57 GMT
కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దేశానికి ‘కాబోయే ప్రధానమంత్రి’  అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని చెలరేగిపోతూ ఉండే రాహుల్ కు రాజకీయ పరిణతి లేదనే సంగతి మరోసారి బయటపడింది. నితీశ్ కుమార్ గత్యంతరం లేని పరిస్థితుల్లో బీహార్లోని మహాకూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, భాజపా మద్దతుతో తిరిగి గద్దె ఎక్కిన తర్వాత.. రాహుల్ ఆయన గురించి అనేక విమర్శలు చేశారు. నిజానికి రాజకీయాల్లో అంత తొందరపాటు పనికి రాదు. కాస్త వేచిచూసే ధోరణి అవసరం. అయితే అంత విజ్ఞత తనకెందుకు ఉంటుందన్నట్లుగా, అటు ప్రమాణం చేయగానే.. ఇటు రాహుల్ చెలరేగిపోయారు. నితీశ్ అధికారం కోసం ఏమైనా చేసే వ్యక్తి అని, మూడు నాలుగు నెలల ముందు నుంచే ఆయన ఈ స్కెచ్ తో ఉన్నారని ఇలా రకరకాలుగా నితీశ్ ను దుమ్మెత్తిపోశారు.

కానీకేవలం ఒక్కరోజు వ్యవధిలో ఆయనకు మరో ఝలక్ వచ్చింది. నితీశ్ కుమార్ కొత్తగా ఎన్డీయేకూటమిలో చేరి ఉండవచ్చు గా.. కానీ,  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకే మద్దతు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన వైనం రాహుల్ ను షాక్ కు గురిచేసి ఉంటుంది.

నిన్ననే తామంతా తెగ విమర్శిస్తే ఇవాళ తమ అభ్యర్థికి ఆయన ఎందుకు మద్దతు ఇస్తున్నారో బహుశా రాహుల్ కు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. ఈ విషయంలో నితీశ్ మాటకు కట్టుబడి ఉన్నట్లుగా అర్థమవుతోంది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆయన యూపీఏ కూటమి అభ్యర్థి మీరాకుమార్ ను పట్టించుకోకుండా , ఎన్డీయే అభ్యర్థి రాంనాధ్ కోవింద్ కు మద్దతిచ్చారు. అదే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా యూపీఏ గోపాలకృష్ణ పేరు ప్రకటించిన తర్వాత ఆయనకు తాము మద్దతిస్తాం అని చెప్పేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన ఎన్డీయే కూటమిలోకి వచ్చారు. కానీ మాట మీద నిలబడాలనే తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆయన గోపాలకృష్ణ కే మద్దతిస్తున్నట్లుగా అనిపిస్తోంది.

అయితే నితీశ్ అవకాశ వాది అని, అధికారం కోసం ఆయన ఏమైనా చేస్తారని రాహుల్ చేసిన విమర్శలను నితీశ్ ఏమాత్రం పట్టించుకోలేదని కూడా అర్థమవుతోంది. తాను స్వచ్ఛంగా ఉన్నంత వరకు, నమ్మింది చేసుకుపోయే రకం నాయకుడు నితీశ్ అని అర్థమవుతోంది.
Tags:    

Similar News