పవన్ గేలానికి పెద్ద చేపలు చిక్కేనా...?

Update: 2022-11-22 02:30 GMT
పవన్ కళ్యాణ్ ఇపుడు జోరు పెంచారు. తన రాజకీయం గేరు మార్చారు. పోయిన చోట వెతుక్కోవడమే కాదు బలమున్న చోట పట్టు పెంచుకోవాలనుకుంటున్నారు. గోదావరి జిల్లాలలో జనసేనకు స్ట్రాంగ్ గా బేస్ ఉందని అంటున్నారు. దాంతో ఆయన ఇటు మూడు అటు రెండూ అంటూ మొత్తం మరో అయిదు జిల్లాల మీద ఫోకస్ పెట్టారు.

అటు రెండు జిల్లాలు అంటే గుంటూరు, క్రిష్ణాలలో జనసేన బలమెంతో చూసుకుంటున్నారు. దానికి తగినట్లుగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక ఆ రెండు జిల్లాల కంటే కూడా ఉత్తరాంధ్రా మూడు జిల్లాలలో ఫుల్ ఫోకస్ పెడితే మరింతగా జనసేన పుంజుకుంటుంది అన్న అంచనాలతో వ్యూహాత్మకంగానే పవన్ పావులు కదుపుతున్నారు.

అందులో భాగమే  ఆయన విజయనగరం జిల్లా టూర్. ఈ జిల్లాలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఎలా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం అన్న దాని మీదనే పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. ఇటీవల ఆయన విజయనగరం జిల్లా టూర్ చేస్తే దారి పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల పొడవున జనాలే కనిపించారు.

దాంతో వారం తిరగకుండానే పవన్ మరో టూర్ వేస్తున్నారు. ఈ జిల్లాలో పవన్ ఎన్నికల వేళ మాత్రమే పర్యటించారు. ఆ తరువాత మళ్లీ ఈ వైపుగా రాలేదు. కానీ ఇపుడు ఆయన విజయం కోసం విజయనగరాన్ని నమ్ముకున్నారు. ప్రత్యేకించి ఈ జిల్లాలో తూర్పు కాపు సామాజికవర్గం ఎక్కువ. వారంతా టీడీపీకి మద్దతుగా ఉంటూ వచ్చేవారు. అయితే వైసీపీకి 2019 ఎన్నికల్లో వన్ సైడెడ్ గా మద్దతు  ఇచ్చారు.

దాంతో ఈ జిల్లాలో వైసీపీ స్వీప్ చేసి పారేసింది.  మొత్తం తొమ్మిది సీట్లు ఉంటే అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అలాగే ఎంపీ సీటుని కూడా సొంతం చేసుకుంది. ఇక ఇపుడు చూస్తే వైసీపీలో పూర్వం అంత దూకుడు కనిపించడంలేదు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున ఈ జిల్లాను శాసిస్తున్నారు. కానీ వర్గ పోరు కూడా ఉంది. సహజంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది.

అదే విధంగా టీడీపీని తీసుకుంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హవా ఇపుడు సాగడంలేదు. జూనియర్ నేతలు ఎవరూ ఆయన  మాటకు కట్టుబడడంలేదు. సీనియర్లూ జూనియర్ల మధ్యన పడి సైకిల్ పడి తిరుగుతోంది. దాంతో పాటు ఆ పార్టీలోనూ అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఈ పరిణామాలే ఇపుడు జనసేనకు కోటి ఆశలను కలిగిస్తున్నాయని అంటున్నారు.

అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలలోని అసంతృప్తులకు, బిగ్ షాట్స్ కి గేలం వేస్తోంది జనసేన. మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు ఉన్నాయనగా ఇప్ప్పటినుంచే సర్దుకుంటే తప్ప జనసేన గ్లాస్ గలగలలు వినిపించవని ఆలోచనతో ముందుకు ఉరుకుతోంది. అయితే ప్రస్తుతానికి జనసేనకు ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.

వారు మెల్లగా తమ సొంత గూడు వీడి జనసేన వైపు వస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చి 2009 ఎన్నికల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన మీసాల గీత ఓడిపోయారు. 2014లో ఆమె టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచారు. 2019లో అమెకు టికెట్ లభించలేదు. దాంతో ఆమె ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. 2024లో వస్తుంది అన్న గ్యారంటీ అయితే  లేదు.

దాంతో మాజీ పీయార్పీ లీడర్ గా ఉన్న ఆమె జనసేన వైపు చూస్తారా అంటే ఇపుడే కాదు అని అంటున్నారు.  అయితే వైసీపీలో కీలక నేతగా ఉన్న గురాన అయ్యలు ఇపుడు జనసేనలోకి వెళ్తున్నారు. ఆయన ఈ మధ్యనే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ణి కలసి వచ్చారు. పవన్ విజయనగరం టూర్ లో గురాన అయ్యలు జనసేనలో చేరుతారు అన్నమాట.

అలా తొలి బోణీ వైసీపీదే అయింది. అధికార పార్టీ వికెట్ అలా పడినట్లు అయింది. ఇక టీడీపీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరవచ్చు అంటున్నారు. నెల్లిమర్ల నుంచి ఎస్ కోట నుంచి జనసేనలో చేరే వారు ఉన్నారని అంటున్నారు. మొత్తానికి పవన్ విజయనగరం టూర్ ని టాప్ లీడర్స్ శ్రద్ధగా పరీక్షిస్తారని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతానికైతే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నేతలు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News