దీదీ దీక్ష‌!... ఖాకీల మెడ‌కు చుట్టుకుందా?

Update: 2019-02-07 17:13 GMT
కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు పై యుద్ధం ప్ర‌క‌టించిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి - ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కార‌ణంగా బెంగాల్ పోలీసు అధికారుల‌కు కొత్త ఇబ్బందులు ఎదుర‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. శార‌దా చిట్ ఫండ్ కుంభ‌కోణం విచార‌ణ కోస‌మంటూ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తాలో అడుగుపెట్టిన సీబీఐ అధికారుల‌ పై అక్క‌డి పోలీసులు నానా హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో కీల‌క ఆధారాల‌ను ధ్వంసం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కోల్ క‌తా పోలీస్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు ఆయ‌న అధికార నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారుల‌కు బెంగాల్ పోలీసులు చుక్క‌లు చూపారు. ఎత్తి జీపుల్లో ప‌డేయ‌డ‌మే కాకుండా ఏకంగా పోలీస్ స్టేష‌న్ల‌ కు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత తాపీగా వారిని వ‌దిలేశారు. ఈ ఉదంత‌ పై దీదీ పెడ‌బొబ్బ‌లు పెట్టారు. సీబీఐ అధికారుల‌కు చుక్క‌లు చూప‌డ‌మే కాకుండా... మోదీ స‌ర్కారు పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ న‌డి రోడ్డు పై ధ‌ర్నాకు దిగారు. రెండు రోజుల పాటు దీక్ష చేసిన దీదీ.. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు షాకివ్వ‌డం తో విధిలేని ప‌రిస్థితుల్లో మ‌దీక్ష‌ను విర‌మించారు.

ఇక్క‌డిదాకా బాగానే ఉన్నా... నాడు కోల్ క‌తాలో చోటుచేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో పాటు దీదీ దీక్ష‌ను సునిశితంగా ప‌రిశీలించిన మోదీ స‌ర్కారు... ఇప్పుడు త‌న‌దైన శైలి చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ వార్త‌లు నిజమే అయితే... బెంగాల్ ఖాకీల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది. సాధార‌ణంగా పోలీసు శాఖ‌లో ప‌నిచేసే వారు ధ‌ర్నాలు, దీక్ష‌లు చేయ‌డం నిషిద్ధ‌మే. అందులోనూ వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడితే ఓ అర్థం ఉంటుంది గానీ... రాజ‌కీయ నేత‌లు చేసే దీక్ష‌ల్లో పాలుపంచుకోవ‌డం మాత్రం క్ష‌మించ‌రానిదే. అయితే ఈ విష‌యాన్ని మ‌రిచిన బెంగాల్ పోలీసులు కేంద్రంపై ఏకంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీనే దీక్ష‌కు దిగితే... తాము మాత్రం ధ‌ర్నాలో పాలుపంచుకుంటే త‌ప్పేముంద‌నుకున్నారో, లేదంటే.. అస‌లు త‌మ విద్యుక్త ధ‌ర్మాన్ని మ‌రిచారో తెలియ‌దు గానీ... మ‌మ‌త దీక్ష‌లో పోలీసు ఉన్న‌తాధికారులు కూడా కూర్చున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ప‌ట్టేసిన మోదీ స‌ర్కారు ఇప్పుడు చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకు పోలీస్ మాన్యువ‌ల్ ను కేంద్రం ఆధారంగా చేసుకుంద‌ని తెలుస్తోంది.

శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణే బాధ్య‌త‌గా మెల‌గాల్సిన బెంగాల్ పోలీసులు... ఆ ప‌ని మానేసి ఏకంగా ధ‌ర్నాలో కూర్చోవ‌డ‌మేమిట‌న్న కొత్త కోణాన్ని వెలికి తీసిన కేంద్రం... ధ‌ర్నాలో పాల్గొన్న పోలీసు అధికారుల‌కు ఇదివ‌ర‌కు అందిన పోలీస్ ప‌తకాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని నిర్ణ‌యించిందట‌. అంతేనా... ధ‌ర్నాలో పాలుపంచుకున్న బెంగాల్ కేడ‌ర్‌ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్రంలో పోస్టులు ఇవ్వ‌కుండా నిషేధం విధించే దిశ‌గా ఆలోచ‌న చేస్తోంద‌ట‌. ఇదే జ‌రిగితే... దీదీ దీక్ష కార‌ణంగా బెంగాల్ ఖాకీల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌న్న మాట‌. అయినా దీదీ దీక్ష‌లో బెంగాల్ పోలీసులు ఎందుకు కూర్చున్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. దీదీ దీక్ష చేసింది రాజీవ్ కుమార్‌ను కాపాడేందుకే క‌దా. సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్నరాజీవ్‌నే అరెస్ట్ చేసేందుకు వ‌చ్చిన సీబీఐ అధికారుల‌ను న‌గ‌ర పోలీసులు క‌ట్ట‌డి చేశారు. అందుకు సంఘీభావంగా దీక్ష చేసిన దీదీకి త‌మ విద్యుక్త ధ‌ర్మాన్ని మ‌రిచి దీక్ష‌లో పాలుపంచుకున్నారు. ఏదో అలా ఓ ఊపులో ఉన్నారు కాబ‌ట్టి దీక్ష‌లో పాల్గొన్నారులే అనుకోవ‌డానికి కూడా లేదు క‌దా. ఉద్రిక్త ప‌రిణామాలు ఏర్ప‌డ్డ‌ప్పుడు వాటిని అణ‌చివేయాల్సింది పోయి దీక్ష‌ల్లో స్వ‌యంగా పాలుపంచుకోవ‌డం త‌ప్పే క‌దా. మ‌రి ఈ త‌ప్పు చేసిన బెంగాల్ పోలీసుల‌పై నిజంగానే మోదీ స‌ర్కారు చ‌ర్య‌లు చేప‌డితే... అది పెద్ద సంచ‌ల‌నంగానే మారే అవ‌కాశాలున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News