చెడ్డపేరొద్దు.. మోడీ కఠిన నిర్ణయం

Update: 2019-06-03 11:02 GMT
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ పార్టీలన్నీ కుదేలయ్యాయి. కాంగ్రెస్ బోటాబోటీగా అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలడం ఖాయమన్న అంచనాలు వచ్చాయి. ఇక కర్ణాటకలో కొనసాగుతున్న జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో కన్నడ సర్కారు అంపశయ్యపై ఉండేది.

కానీ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేవెగౌడ మోడీని అభినందించడం.. అప్పుడే కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చమని మోడీ అభయం ఇవ్వడం జరిగిపోయింది. దీంతో కుమారస్వామి సర్కారు ఊపిరి పీల్చుకుంది.

అయితే ప్రజలు ఇచ్చిన అఖండమెజార్టీ, ఆశీర్వాదం చాలని.. ఇప్పటికిప్పుడు కర్ణాటక, మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాలను కూల్చితే ఆ వచ్చిన మంచి పేరు పోతుందనే మోడీ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అందుకే కర్ణాటకలో జేడీఎస్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమల’పేరుతో కన్నడ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేపట్టిన ఆపరేషన్ ను తాత్కాలికంగా పక్కనపెట్టేసింది. దీంతో సీఎం కుమారస్వామి ఇక పాలనపై దృష్టిపెడుతానని.. నెలకు నాలుగు రోజులు పల్లెలకు వెళ్లి నిద్ర చేస్తానని పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే బసవరాజు కూడా కుమారస్వామిని కలవడంతో జేడీఎస్ ప్రభుత్వానికి అదనపు బలం సమకూరించింది. ఇప్పటికిప్పుడు కన్నడలో జేడీఎస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అర్థమవుతోంది. మోడీ ఉదాత్త నిర్ణయం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు ఆయాచిత వరమైంది.

    

Tags:    

Similar News