'హిందూత్వ'- మరింత పులిమేయడానికి స్కెచ్‌ రెడీ!

Update: 2015-09-05 04:47 GMT
కరడుగట్టిన ఆరెస్సెస్‌ కార్యకర్త అయిన నరేంద్రమోడీ ప్రధానిగా దేశ పరిపాలన బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి.. దేశంలో హిందూత్వను పులిమేస్తున్నారని.. భారత దేశానికి ఉన్న లౌకిక ముద్రను చెరిపేస్తున్నారని.. హిందూత్వ భావజాలాన్ని ప్రధానంగా విద్యావ్యవస్థ ద్వారా దేశంలోకి చొప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదని అనేక రకాల విమర్శలు పలు సందర్భాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎవ్వరి మాటలనూ ఖాతరు చేయవలసినంత అవసరంలో తాము లేమన్నట్లుగా.. పూర్తి మెజారిటీతో చెలరేగిపోతున్న మోడీ సర్కారు... విమర్శలను వినీవిననట్లుగా, పట్టించుకోకుండా.. తాము తలచుకున్న నిర్ణయాల అమలులో ముందుకు సాగుతూనే ఉన్నది. తాజాగా ఇప్పుడు భారతీయజనతా పార్టీ తీసుకుంటున్న కొన్ని చర్యలను గమనిస్తే.. దేశంలోని వివిధ వ్యవస్థలపై హిందూత్వ ప్రభావాన్ని మరింతగా పులిమేయడానికి స్కెచ్‌ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మార్పులన్నీ ప్రధానంగా విద్యారంగం ద్వారానే చొప్పించడానికి చూస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి.

దేశంలోని విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఎలాంటి మార్పులు రావాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి అనేది నిర్ణయించడానికి భాజపా దేశవ్యాప్తంగా అభిప్రాయాలు సేకరించబోతోంది. ఇందుకోసం రెండు రోజుల పాటూ ఢిల్లీలో మేధోమధన సదస్సు పెడుతున్నారు గానీ.. సూచనలన్నీ కేవలం భాజపా మేధావులనుంచి మాత్రమే స్వీకరిస్తారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోని విద్యా సాంస్కృతిక మంత్రులందరినీ పిలిపించి.. వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. తమాషా ఏంటంటే.. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు, హిందూత్వ ప్రచారానికి కట్టుబడిన విద్యాపీఠాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు వస్తారు.

వీరంతా కలిసి.. దేశంలో విద్యా సాంస్కృతిక రంగాల్లో ఎలాంటి కొత్త విధానాలు ఉండాలో నిర్ణయిస్తారన్నమాట. అంటే అచ్చంగా ఈ రెండు రంగాల్లో మరింతగా హిందూత్వ రంగు పులమడానికి ప్రయత్నం జరుగుతున్నదని తేటతెల్లంగా అర్థమవుతోంది. వేదాలు, జానపద సాహిత్యం, ప్రాచీన భాషలు లాంటివి ఎజెండా కింద ప్రకటిస్తున్నారు గానీ. సదస్సు పూర్తయి తీర్మానాలు వచ్చేసరికి.. హిందూత్వ రంగును, విద్యా సాంస్కృతిక రంగలపై బలంగా పులుముతారని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News