ఢిల్లీ దర్శకత్వంలో...బాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ

Update: 2018-12-26 14:05 GMT
నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువ మంది నోట వచ్చిన మాట ఏమిటి. అందునా.... తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎక్కువ మంది నోట వచ్చిన మాట ఏమిటనుకుంటున్నారు. ఇంతకీ ఆ మాట ఏమిటనుకుంటున్నారా.... అవును.. అదే.. రిటన్ గిఫ్ట్. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత  అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.  ఆ విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో ఈ రిటన్ గిఫ్ట్ మాట మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తాను విజయం సాధించకుండా చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారని - ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అదిగో అప్పటి నుంచే ఈ రిటర్న్ గిఫ్ట్ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఈ రిటర్న్ గిఫ్ట్ కల్వకుంట్ల వారు ఎప్పుడు ఇస్తారో... ఏమిస్తారో మాత్రం సస్పెన్స్. అయితే దీనిపై ప్రతిరోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికలు ముగిసి ఘనమైన విజయం సాధించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొలి సారిగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ మూడు రోజులుండే కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు - అనుమతులతో పాటు ఇతర అంశాలన్నీ కలిసి 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధాని మోదీకి ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. అయితే ఇది తెలంగాణకు సంబంధించిన అంశాలు మాత్రమే. పైకి మాత్రం ఈ అంశాలే ప్రధాని - తెలంగాణ ముఖ్యమంత్రి మధ్యే రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీలో వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇస్తానన్న రిటన్ గిఫ్ట్ అంశం కూడా చర్చకు వచ్చిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడం - తెలుగుదేశం పార్టీని ఓడించడం వంటి అంశాలపై కొంతసేపు చర్చించినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అటు భారతీయ జనతా పార్టీకి - ఇటు తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఉమ్మడి శత్రువు కావడంతో ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడికి సంయుక్తంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చల్లో తెలుగుదేశం పార్టీ - చంద్రబాబు నాయుడి గురించే ఎక్కువ సమయం వెచ్చించినట్లు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడి రిటర్న్ గిఫ్ట్ ఢిల్లీలో ఫిక్సయ్యిందంటున్నారు.


Tags:    

Similar News