ఆంధ్రోళ్ల‌కు మోడీ ఎంత అన్యాయం చేస్తున్నారంటే..

Update: 2017-11-01 05:26 GMT
అన్యాయం మీద అన్యాయం. దేశంలో మ‌రే రాష్ట్రానికి జ‌ర‌గ‌నంత ద్రోహం ఏపీకి జ‌రుగుతోంది. విభ‌జ‌న పేరుతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దెబ్బేస్తే.. తాజాగా ప్ర‌ధాని త‌న తీరుతో ఆంధ్రోళ్ల‌ను చావుదెబ్బ కొడుతున్నారు. అన్యాయంగా ఇద్ద‌రు ప్ర‌ముఖ నేత‌ల్ని అన్నేసి మాట‌లు అంటున్నారు.. దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే..ఉన్నాయ‌ని చెప్పాలి. ఇందుకు ఆధారంగా చూపిస్తున్న గ‌ణాంకాలు చూస్తే ఆంధ్రోళ్ల‌కు జ‌రుగుతున్న అన్యాయం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపించే ప‌రిస్థితి.

విభ‌జ‌న ఆంధ్రోళ్ల‌కు ఇష్టం లేదు. అయినా విభ‌జ‌న జ‌రిగిపోయింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుక‌న్న రీతిలో విభ‌జ‌న ఎందుకు జ‌రిగింద‌న్న పెడ‌బొబ్బ‌లు ఎన్ని పెట్టినా ప్ర‌యోజ‌నం లేదు. అందుకే ఈ విష‌యాన్ని వ‌దిలేద్దాం. విభ‌జ‌న త‌ర్వాత  ఏపీకి రాజ‌ధాని లేదు. అంత‌కు మించి ఆర్థిక త‌ల‌పోటు ఉండ‌నే ఉంది. ఆదాయాన్ని ఇచ్చే ప‌రిశ్ర‌మ‌లు లేక‌.. సంప‌దను సృష్టించే సేవా రంగం లేదు. అప్పుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏ రోజుకు ఆ రోజు అన్న‌ట్లుగా పాల‌నా బండిని న‌డిపిస్తోంది ఏపీ స‌ర్కారు.

విభ‌జ‌న క‌ష్టాల‌న్న‌వి లేకుండా చేస్తామ‌ని.. ఏపీని ఆదుకుంటామ‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఏపీకి వ‌చ్చిన మోడీ చాలానే చెప్పారు. మ‌రి.. ఆయ‌న మాట‌లు ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్నాక ఏమ‌య్యాయి అన్న‌ది ఆరా తీస్తే.. ఏపీ ప‌ట్ల ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన వివ‌క్ష క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఆదాయాన్ని స‌మ‌కూర్చే ద‌క్షిణాదిని వ‌దిలేసి.. ఉత్త‌రాది మీద మోడీ ఫోక‌స్ పెట్ట‌ట‌మే కాదు.. నిధుల కేటాయింపులోనూ ఉత్త‌రాదికి పెద్ద‌పీట వేస్తున్న వైనం ఇప్పుడు  ఎక్కువ అవుతుంద‌న్న విమ‌ర్శ అంత‌కంత‌కూ పెరుగుతోంది.  దేశ వ్యాప్తంగా ప‌న్నుల రూపేణ వ‌స్తున్న ఆదాయాన్ని తిరిగి రాష్ట్రాల‌కు కేటాయించే స‌మ‌యంలో.. ఉత్త‌రాదికి పెద్ద‌పీట వేస్తున్న మోడీ స‌ర్కారు ద‌క్షిణాదిని ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇక‌.. ఏపీ సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

అభివృద్ధిలో ఆంధ్రోళ్లు వెనుక‌బ‌డి ఉన్నారు. విభ‌జ‌న కార‌ణంగా త‌గిన ఆర్థిక దెబ్బ‌ను మానేలా చేయ‌టానికి కేంద్రం నిధుల్ని అందిస్తే బాగుండేది. కానీ.. ఆ ప‌ని చేయ‌ని మోడీ స‌ర్కారు తీరుతో ఏపీ ప‌రిస్థితి అంత‌కంత‌కూ దిగ‌జారుతోంది.

కేంద్రం ప్రస్తుతం 44 ప‌థ‌కాల్ని అమ‌లు చేస్తోంది. ఇందులో 24 ప‌థ‌కాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. ఎనిమిది ప‌థ‌కాల్లో ఏపీకి నిధులు విడుద‌ల దాదాపు సున్నాగా చెబుతున్నారు.

మ‌రో 16 ప‌థ‌కాల్లో అంతంత మాత్ర‌మే. మిగిలిన 20 ప‌థ‌కాల విషయాన్ని చూస్తే ఫ‌ర్వాలేద‌న్న మాట వినిపిస్తోంది. కేంద్ర అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్లో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోని తొలి ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో రూ.78,914 కోట్లు విడుద‌ల చేస్తే.. అందులో రాష్ట్రానికి వ‌చ్చింది కేవ‌లం రూ.1880 కోట్లు మాత్ర‌మే. శాతాల్లో చూస్తే ఏపీకి మోడీ స‌ర్కారు విడుద‌ల చేసిన నిధులు అక్ష‌రాల 2.38 శాతం మాత్ర‌మే.

ఈ గ‌ణాంకాలు చూస్తే అనిపించేది ఒక్క‌టే ప‌న్నులు క‌ట్టేందుకే ద‌క్షిణాది రాష్ట్రాలు ఉన్నాయా? అని. ప‌న్ను ఆదాయంలో ఉత్త‌రాదితో పోలిస్తే ద‌క్షిణాది నుంచి వ‌సూలు అయ్యేది ఎక్కువ‌. అదే స‌మ‌యంలో కేటాయింపుల విష‌యానికి వ‌స్తే ఉత్త‌రాదికి పెద్ద‌పీట వేస్తున్న మోడీ స‌ర్కారు.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అర‌కొర అన్న‌ట్లుగా  చేస్తున్నాయి. మోడీ సర్కారు అమ‌లు చేస్తున్న ఏ ప‌థ‌కాన్ని చూసినా ఏపీకి ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌న్న మాట వినిపిస్తోంది.  ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌నా కింద ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలి ఆర్నెల్ల‌లో కేంద్రం రూ.18602 కోట్లు కేటాయిస్తే.. ఏపీకి ఇచ్చింది అక్ష‌రాల రూ.71 కోట్లు మాత్ర‌మే. శాతాల్లో చూస్తే.. ఇది 0.4 శాతం.

ప్ర‌తిది శాతాల్లో చూపించి మాయ చేస్తున్నార‌న్న డౌట్ రావొచ్చు. అందుకే.. ఈ ప‌థ‌కం కింద మిగిలిన ఉత్త‌రాది రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయించిన నిధుల శాతాన్ని చూస్తే.. రాజ‌స్థాన్‌ కు 10 శాతం ఇస్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కు 25 శాతాన్ని కేటాయించ‌టం గ‌మ‌నార్హం.

అదే రీతిలో సెంట్ర‌ల్ రోడ్ ఫండ్ కింద కేటాయించిన ప‌న్నులు చూస్తే.. ఏపీకి పైసా ద‌క్క‌లేదు. అమృత్ ప‌థ‌కం కింద కేంద్రం రూ.2766 కోట్లు కేటాయిస్తే.. ఏపీకి 4 శాతం ద‌క్క‌గా.. యూపీకి 18 శాతం.. మ‌హారాష్ట్రకు 15 శాతం విడుద‌ల చేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న‌.. ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న‌.. మ‌త్స్య‌రంగ స‌మ‌గ్ర అభివృద్ధి ఇలా ప‌లు ప‌థ‌కాల‌కు కేంద్రం వేలాది కోట్లు విడుద‌ల చేసినా.. అందులో ఏపీ వాటా అక్ష‌రాల సున్నా.

దారుణ‌మైన విష‌యం ఏమిటంటే కొన్ని ప‌థ‌కాల విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాల కంటే త‌క్కువ‌గా ఏపీకి నిధులు విడుద‌ల చేయ‌టం. స్మార్ట్ సిటీస్ కింద కేంద్రం రూ.3757 కోట్లు విడుద‌ల చేసింది. అందులో 3శాతం నిధులు మాత్ర‌మే ఏపీకి ల‌భించాయి. అదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడుల‌కు 12 శాతం చొప్పున నిధుల‌ను విడుద‌ల చేయ‌టం గ‌మ‌నార్హం. పోలీసు ద‌ళాల ఆధునికీక‌ర‌ణ కోసం దేశం మొత్తానికి రూ.845 కోట్లు కేటాయించ‌గా రాష్ట్రానికి ద‌క్కిన వాటా కేవ‌లం ఒక్క శాతం మాత్ర‌మే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప‌థ‌కాలకు ఏపీకి ద‌క్కిన నిధులు చాలా త‌క్కువ‌. కేంద్రం అమ‌లు చేస్తున్న మొత్తం 44 ప‌థ‌కాల్లో కేవ‌లం 20 ప‌థ‌కాల్లోనే ఏపీకి మెరుగైన వాటా ల‌భించింది.

అంతా బాగున్న‌ప్పుడు.. ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉన్న‌ప్పుడు కేంద్రం ప‌ట్టించుకోకున్నా.. నిధులువిడుద‌ల చేయ‌కున్నా ఏదో ర‌కంగా బండి లాగించేయొచ్చు. ఓప‌క్క రాజ‌ధాని లేకుండా.. పుట్టెడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప‌థ‌కాల కింద భారీగా నిధులు విడుద‌ల చేస్తే అభివృద్ధికి అస్కారం ఉంటుంది.ఒక తల్లికి ప‌ది మంది పిల్ల‌లు ఉంటే అంద‌రూ చురుగ్గా ఉండ‌రు. ఊహించ‌ని రీతిలో వెనుక‌బడిన కొడుక్కి కాస్త ఎక్కువ ప్రేమ‌ను పంచితే మిగిలిన వారి మాదిరి శ‌క్తివంతం కావ‌టానికి అవ‌కాశం ఉంది. కానీ.. కేంద్రం ఏపీ విష‌యంలో క‌న్న‌త‌ల్లి మాదిరి కాకుండా స‌వ‌తి త‌ల్లి మాదిరి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఆంద్రోళ్లను ఆవేద‌నకు గురి చేసిన ఏ రాజ‌కీయ పార్టీ బాగుప‌డిన దాఖ‌లాలు చ‌రిత్ర‌లో లేవు. ఆ జాబితాలో బీజేపీ చేరాల‌ని మోడీ అనుకుంటున్నారా?
Tags:    

Similar News