సార్‌.. ఆ హామీ నెర‌వేర్చండి: సీఎం జ‌గ‌న్‌కు నారా లోకేష్ లెట‌ర్‌

Update: 2022-01-21 15:33 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రెండు పేజీల లేఖ రాశారు. దీనిలో ఆయ‌న పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌జ‌లకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. స‌ద‌రు హామీని నిల‌బెట్టుకోవాల‌ని కోరారు. గుంటూరు జిల్లా తాడేప‌ల్లి రైల్వే స్థలాల్లోని నివాసితులకి  ఇచ్చిన హామీ ప్రకారం వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించే వ‌ర‌కూ.. రైల్వే అధికారులు వారి ఇళ్లు కూల్చకుండా స‌మయం ఇచ్చేలా సీఎం త‌క్షణ‌మే చ‌ర్యలు తీసుకోవాలని  లోకేశ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్కి ఆయన లేఖలు రాశారు.

తాడేప‌ల్లిలోని 6, 14, 15, 16వార్డుల ప‌రిధి రైల్వే స్థలాల్లో న‌ల‌భై ఏళ్లుగా ఇళ్లు క‌ట్టుకుని పేద‌లు నివ‌సిస్తున్నారని లోకేష్ తెలిపారు. వారికి ఒక్కరోజులో ఇళ్లు ఖాళీ చేయాల‌ని రైల్వే అధికారులు తాఖీదులు ఇచ్చారని తెలిపారు. దీనిపై అత్యవ‌స‌రంగా జగన్‌ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వేస్థలంలో ఉన్న పేద‌ల‌కు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వారందరికీ వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించేవ‌ర‌కూ ఇక్కడే నివాసం ఉండేలా రైల్వే అధికారుల‌ని ఒప్పించాలని కోరారు. దాదాపు 650 పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు దాదాపుగా 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని వివరించారు.

రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వారిదని విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉన్నపళంగా జనవరి 22 లోపు ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆవేదన చెందారు. కొవిడ్ కారణంగా పనులు లేక పూట గడవటమే ఇబ్బందిగా మారిన వారికి.. రైల్వే నోటీసులతో నిలువ నీడ కూడా లేకుండా పోతోంద‌ని ఆందోళన చెందుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించే వరకూ తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసితుల‌కు మానవతా దృక్పథంతో అక్కడే వుండే అవకాశం ఇవ్వాలని కోరారు.
Tags:    

Similar News