ఏమీ లేకున్నా బాబు ఒక్క‌డు ఏపీకి చాలా లోకేశ్‌?

Update: 2017-12-03 06:15 GMT
ఇదెక్క‌డ భ‌జ‌న‌రా బాబు. పొగ‌డ‌టం త‌ప్పు కాదు. ఆ పేరుతో అర్థంప‌ర్థం లేకుండా..మినిమం లాజిక్ లేకుండా మాట్లాడ‌టంతోనే అస‌లు చికాకంతా. త‌న మాట‌ల‌తో మీడియాలో త‌ర‌చూ ఎక్కేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు.. మంత్రి లోకేశ్ చేసిన తాజా వ్యాఖ్యలు వింటే న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాదు.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలోరాష్ట్రంలో ఎలాంటి మౌలిక స‌దుపాయాలేవీ లేక‌న్నా.. బ్రాండ్ అంబాసిడ‌ర్ చంద్ర‌బాబు ఒక్క‌డు చాల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇలాంటి ముఖ‌స్తుతి మాట‌లు వేరే వాళ్ల నోటి నుంచి వ‌చ్చి ఉండే మ‌రోలా ఉండేది. తండ్రిని కొడుకు పొగిడేయ‌టం ఎబ్బెట్టుగా ఉంద‌ని చెప్పాలి. చిన‌బాబు మాట‌లు చూస్తుంటే.. ఎవ‌రు లేకున్నా.. ఏం లేకున్నా ఫ‌ర్లేదు మా నాన్న ఒక్క‌డు చాల‌న్న‌ట్లుగా ఉంది.

ఎవ‌రి నాన్న వారికి గొప్ప‌. కాద‌ని ఎవ‌రూ అన‌రు. కానీ.. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉండే వ్య‌క్తి ఒక్క‌డుచాలు రాష్ట్రానికి. ఆయ‌న‌తోనే అంతా న‌డిచిపోతుందన్న లోకేశ్ మాట‌లు విన్న‌ప్పుడు.. మ‌రింత మొన‌గాడైన బాబు ఉన్న‌ప్పుడు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల‌కు ఏపీ యువ‌కులు ఎందుకు వెళ్లిపోతున్న‌ట్లు?   (ఇదే స‌మావేశంలో లోకేశ్  మాట్లాడుతూ.. విశాఖ‌ప‌ట్నంలో ప‌ని చేయ‌టానికి ఏపీ యువ‌కులు సిద్ధంగా లేర‌ని.. చెన్నై.. బెంగ‌ళూరు.. హైద‌రాబాద్‌ ల‌కు వెళుతున్నార‌ని.. వారంతా వైజాగ్‌ లో ప‌ని చేయాల‌ని సుద్దులు చెప్పారు) ఏపీకి చంద్ర‌బాబు లాంటి తోపు ముఖ్య‌మంత్రి ఉన్నందుకేనా.. గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో దాదాపు ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయిల అప్పు రాష్ట్రం మీద ప‌డింది?

బ్రాండ్ అంబాసిడ‌ర్ గా బాబు ఉన్నాడ‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్న లోకేశ్ బాబు.. నాలుగేళ్ల బాబు స‌ర్కారు ఏపీ జీవ‌న ప్ర‌మాణాల్ని ఎంత‌వ‌ర‌కూ పెంచింద‌న్న‌ది ప్ర‌శ్న‌. ప‌ట్టిసీమ త‌ప్పించి మ‌రింకేమైనా ప్రాజెక్టును  ఏపీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తి చేసిందా? అంటే లేద‌ని చెప్పాలి. అంతేనా.. ఏపీకి స‌రైన ఐటీ కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చింది లేదు. ఇన్నిలోటుపాట్లు ఉన్నా.. త‌న తండ్రి ఒక్క‌డు ఏపీకి స‌రిపోతాడంటున్న లోకేశ్ మాట‌లు కామెడీగా అనిపించ‌క మాన‌దు. ఇలాంటి కామెడీలో ఆంధ్రోళ్ల బ‌తుకులు మార‌వు లోకేశా!
Tags:    

Similar News