డబ్బుల్లేని ప్రచారం : డిజిటల్ అస్త్రాలతో ఏబీవీ సంచలనం!
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దూకుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దూకుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా విజయవాడ నగర సమస్యలపై ఆయన సంధిస్తున్న ప్రశ్నలు ప్రధాన పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎందుకు ఎన్నుకోవాలో వివరిస్తూ ఆయన వరుస వీడియోలు వదులుతున్నారు. అదేసమయంలో డిజిటల్ మీడియాలోనూ ఏబీవీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటూ, ప్రత్యర్థులను ఇరుకన పెడుతున్న ఏబీవీ ఎన్నికల రేసులో ప్రధాన పోటీదారుగా అవరతించారని అంటున్నారు.
మారుతున్న సమీకరణాలు
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీతో విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఏబీవీ నామినేషన్ వేసినంతవరకు ఒక లెక్క.. తరువాత మరో లెక్క అన్నట్లుగా రాజకీయ పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఏకపక్షంగా విజయం సాధిస్తారని అంచనాలు వేశారని అంటున్నారు. అయితే ఏబీవీ రంగంలోకి వచ్చిన తర్వాత లెక్కలు, సమీకరణాలు మారుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తనకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ఏబీవీ విడుదల చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులకు తనకు తేడా వివరిస్తున్న ముందుగా కూటమి అభ్యర్థిని టార్గెట్ చేస్తున్నారు.
నేరుగా ముఖ్యమంత్రిపైనే విమర్శలు
వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి తనకు పోటీయే కాదని ఏబీవీ భావిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగరాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్న ఏబీవీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ‘‘సైబరాబాద్ కట్టాను, హైదరాబాద్ కట్టాను అంటావు.. విజయవాడకు ఏం చేశావు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏబీవీ ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పట్టణాభివృద్ధికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తే విజయవాడకు ముష్టి వేసినట్లు రూ.140 కోట్లు ఇస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీయడం చర్చనీయాంశం అవుతోంది.
మంగళగిరి ఎక్కవ.. విజయవాడ తక్కువా?
విశాఖకు రూ.4 వేల కోట్లు, మంగళగిరికి రూ.250 కోట్లు కేటాయించారని విజయవాడకు మాత్రం నిధుల కేటాయింపులో అన్యాయం చేశారంటూ ఏబీవీ చెబుతున్న లెక్కలు అగ్గిరాజేస్తున్నాయని అంటున్నారు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీపైనా ఏబీవీ సంధిస్తున్న ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. బుడమేరు వరదల సమయంలో విడుదలైన రూ.600 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం విడుదల చేసిన రూ.500 కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ ఏబీవీ నిలదీస్తున్నారు.
ఎన్నికల ఖర్చులపైనా ఫైర్
ఎన్నికల్లో గెలిచేందుకు తాను డబ్బు ఖర్చు పెట్టనని చెబుతున్న ఏబీవీ కొత్త సంస్కృతికి తెర తీశారని అంటున్నారు. తన ప్రత్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేస్తున్నారని చెప్పడమే కాకుండా, ఆ డబ్బు రాబట్టుకునేందుకు విచ్చలవిడి అవినీతి చేస్తారని ఆరోపిస్తూ ప్రజలను ఆలోచనలకు గురిచేస్తున్నారు. మరోవైపు 35 ఏళ్ల పరిపాలన అనుభవం, తన చదువు, సమర్థతను చూసి ఓటు వేయాలని కోరుతున్న ఏబీవీ విపక్ష అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కన్నా తానే బెటర్ అన్నట్లు ప్రచారం చేయడంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బలమైన ప్రత్యర్థిగా పోటీ
మొత్తానికి తన వాగ్దాటితో ఏబీవీ విజయవాడ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా అవతరించారని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాను సమర్థంగా వాడుకుంటూ ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ ఐదేళ్లలో ఏం చేయలేదని ఎత్తిచూపడమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడపై సవతి ప్రేమ చూపిస్తున్నారనే విధంగా విమర్శలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారని అంటున్నారు. ఇక తన విమర్శలను సమర్థించుకునేలా గణాంకాలు తెరపైకి తెస్తూ ప్రభుత్వాన్ని ఒత్తిడికి లోను చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా కూడా ఏబీవీకి వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని, సోషల్ మీడియా మేయర్ అంటూ ట్రోల్ చేస్తోందని అంటున్నారు.