గుండ కుటుంబంతో ధర్మాన సేఫ్ గేమ్ ?

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ లీడర్. చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన ఆయన ఇప్పటికి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పలు మార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Update: 2026-10-22 07:17 GMT

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ లీడర్. చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన ఆయన ఇప్పటికి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పలు మార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరాంధ్రా స్థాయి నేతగా ఉన్నారు. ప్రముఖ బీసీ నేతగా అందరి మన్ననలు అందుకున్నారు. మంచి వాగ్దాటి ఆయన సొంతం. ఇక వ్యూహాల విషయంలో ఆయనను అంతా కూడా దిట్ట అంటారు. అలాంటి ధర్మాన దశాబ్దాల రాజకీయ జీవితంలో తన వారసుడిని ముందుకు తేలేకపోతున్నారు అని అంటున్నారు. ఇపుడు చాన్స్ వచ్చినా పక్క పార్టీ నుంచి నాయకులను తెచ్చి సేఫ్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆనాడు ఆరాటంతో :

ఇదిలా ఉంటే 2021లో వైసీపీ అధికారంలో ఉన్నపుడు శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు పెట్టించాలని ధర్మాన సోదరులు ప్రయత్నించారు అని గుర్తు చేస్తున్నారు. ఆనాడు తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుని తొలి మేయర్ గా చేయాలని కూడా ఆరాటపడిన విషయాన్ని కూడా చెబుతున్నారు. అయితే కోర్టు వివాదాల వల్ల శ్రీకాకుళానికి అప్పట్లో ఎన్నికలు జరగలేదు, మరి ఇపుడు చూస్తే కచ్చితంగా తమ ఇంటి వారికే పదవులు ఇవ్వవచ్చు కదా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే శ్రీకాకుళం మేయర్ మహిళకు రిజర్వ్ అయింది. దాంతో తమ వారినే ముందు పెట్టి గెలిచి చూపించవచ్చు కదా అన్నది ప్రత్యర్ధుల మాటగా ఉంది.

గుండా కుటుంబంతో కలసి :

ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉంది. కాబట్టే ఆయన నాలుగు సార్లు శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. ఆయన సతీమణిగా లక్ష్మీదేవి కూడా 2014లో గెలిచారు. ఇపుడు ఆ కుటుంబాన్ని వైసీపీలోకి ధర్మాన సోదరులు తీసుకుని వచ్చారు. పైగా ఖర్చులన్నీ పెట్టుకుంటామని హామీ ఇచ్చి మరీ టీడీపీ నేత గుండా లక్ష్మిదేవిని వైసీపీలోకి తీసుకు వస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరి టీడీపీలో ఉన్న లక్ష్మీదేవిని తెచ్చి వైసీపీ టికెట్ ఇచ్చే బదులు తన కుటుంబీకులకో లేదా వైసీపీలో మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన పద్మావతి లాంటి వారికో టికెట్ ఇచ్చి గెలిపించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

గెలుపు ధీమా ఎంత :

ఇక చూస్తే గుండా కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు ఉంది. బలం కూడా ఉంది. అయితే ఆమె వైసీపీలోకి చేరడం వల్ల ఆ బలం అంతా ఈ వైపు షిఫ్ట్ అవుతుందా అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే నాయకులు వెళ్ళినంత మాత్రాన పార్టీ క్యాడర్ వెంట వెళ్లే సందర్భాలు బహు తక్కువ. పైగా నాడు కాంగ్రెస్ తో తరువాత వైసీపీతో నేరుగా నిలిచి పోరాడిన చరిత్ర శ్రీకాకుళం టీడీపీ క్యాడర్ కి ఉంది. అందుకే వారు వెంట వచ్చేది ఉండదని అంటున్నారు. ఇక చూస్తే శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గోండు శంకర్ ఉన్నారు. ఆయన బాగానే పాతుకుని పోయారు. దాంతో క్యాడర్ ని ఆపుతారు అని అంటున్నారు. మరి గుండా లక్ష్మీదేవిని వైసీపీలోకి తెచ్చి ధర్మాన సోదరులు గెలిపించగలరా అన్నది మరో ప్రశ్న.

అధికార కూటమితో :

ఇక అధికార కూటమితో ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఉందిపుడు. శ్రీకాకుళం మేయర్ టికెట్ ని జనసేనకు కేటాయించారు. దాంతో పాటు కింజరాపు కుటుంబీకులు బాబాయి అబ్బాయి ఇద్దరూ ప్రతిష్టగా తీసుకుంటారు. శ్రీకాకుళం అంటేనే టీడీపీకి కంచుకోట. అత్యధిక సార్లు ఆ పార్టీనే అక్కడ గెలిచింది. అలాంటి చోట వైసీపీ నుంచి లక్ష్మీదేవి పోటీ పడితే గెలుపు అవకాశాలు ఏ మేరకు అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి అయితే ధర్మాన సోదరులు గుండ లక్ష్మీదేవిని పార్టీలోకి తెచ్చి సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News