ఢిల్లీ గాలి వెరీ పూర్...గడ్డు కాలమే !
ఢిల్లీ గాలి వెరీ పూర్ అని నివేదికలు చెబుతున్నాయి. దేశం మొత్తానికి రాజధానిగా ఢిల్లీ ఉంది. కాబట్టి సహజంగానే రష్ ఎక్కువగా ఉంటుంది.
ఢిల్లీ గాలి వెరీ పూర్ అని నివేదికలు చెబుతున్నాయి. దేశం మొత్తానికి రాజధానిగా ఢిల్లీ ఉంది. కాబట్టి సహజంగానే రష్ ఎక్కువగా ఉంటుంది. దాంతో గాలిలో నాణ్యత ఎపుడూ కనిష్ట స్థాయిలోనే కనిపిస్తుంది. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీ వాసులకు కలవరమే. గాలిలో నాణ్యత తగ్గి నరకం చూసే సందర్భాలే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వింటర్ సీజన్ మొదలైంది కాబట్టి ఢిల్లీలో వాయు కాలుష్యం మీద అధికారులు అలెర్ట్ అవుతున్నారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బుధవారం నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లోని మొదటి దశను తక్షణమే అమలులోకి తెచ్చింది. ఇక మీదట గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు. తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని సంబంధిత ప్రభుత్వ శాఖలను స్థానిక సంస్థలను కమిషన్ ఆదేశించింది.
మరింత పూర్ కాకుండా :
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నివేదిక ప్రకారం చూస్తే అక్టోబర్ 20న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 179గా నమోదైంది. అయితే ఇది ఒక మోస్తరు కేటగిరీలోకి వస్తుంది. అయితే అక్టోబర్ 21న మధ్యాహ్నం సమయానికి చూస్తే ఇండెక్స్ 244 కు చేరింది. దీంతో గాలి నాణ్యత పూర్ కేటగిరీలోకి మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ పూర్ కేటగిరీ అన్నది రానున్న కాలంలో కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ ఐఐటీఎం సైతం అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ లోని మొదటి దశ చర్యలను తక్షణం అమలు చేయాలని నిర్ణయించారు.
గాలి నాణ్యత కోసం :
గాలి నాణ్యత 201 నుంచి 300 మధ్య ఉంటే తొలి దశగా భావిస్తారు. 301 నుంచి 400 మధ్య ఉంటే రెండో దశ అలాగే, 401 నుంచి 450 మధ్య ఉంటే మూడో దశగా లెక్కిస్తారు. ఇక గాలి నాణ్యత ప్రమాణాలు 450 దాటితే నాలుగో దశ వెంటనే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో మొదటి దశలో గాలి నాణ్యత ఉంది. అందుకే రోడ్ల మీద ధూళిని తగ్గించేలా,నీటిని చల్లడం, నిర్మాణాలు జరిగే ప్రాంతాలలో దుమ్ము ధూళి వంటివి తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై నిరంతర తనిఖీలు ఉంటాయి. ట్రాఫిక్ నిర్వహణని క్రమబద్ధీకరించడం, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు వేదజల్లే ఉద్గారాలపైనా ఫోకస్ పెడతారు.
ఢిల్లీ ప్రభుత్వం చర్యలు :
చలి కాలంలో గాలి నాణ్యత మరింతగా తగ్గకుండా ఢిల్లీ ప్రభుత్వం కూడా కార్యాచరణను సిద్ధం చేసింది. నవంబర్ 1 నుంచి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. అలాగే కాలం తీరిన వాహనాలపై చర్యలు ఉంటాయి. అలాగే నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను ఢిల్లీలోకి రానీయకుండా నిరోధిస్తారు అలాగే ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందిలో యాభై శాతం ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఏది ఏమైనా ఢిల్లీలో గాలి నాణ్యత ఏటేటా తగ్గుముఖం పడుతోంది. దానిని నియంత్రించడం కత్తి మీద సాము అవుతోంది. ఢిల్లీలో జన సాంధ్రత అధికంగా ఉంటోంది. దాంతో గాలిలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం అన్నది కఠిన పరీక్ష గా మారుతోంది.