బిగ్ బ్రేకింగ్ : మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ నిలిపేసిన ఎస్ఈసీ !
ఏపీలో 13 కార్పోరేషన్లు, 87 మునిసిపాలిటీలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపి వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏపీలో 13 కార్పోరేషన్లు, 87 మునిసిపాలిటీలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపి వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా వాయిదా పడనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం ఎస్ఈసీ తీసుకుంది అని అంటున్నారు.
సుప్రీం ఆదేశాలతో :
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల వినతులు ఆధారాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని చెబుతున్నారు. అనేక చోట్ల శాంతిభద్రతల సమస్యల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల అంశంపై కూడా ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎస్ ఈసీ వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నివేదికలను కోరింది. వాటి ఆధారంగా గురువారం ఎక్కడెక్కడ మళ్ళీ నామినేషన్లకు గడువు పొడిగించాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు.
రెండు రోజుల గడువు :
ఇక సుప్రీం కోర్టు ఆదేశాలను గమనిస్తే కనుక నామినేషన్ల గడువు పొడిగిస్తే కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని ఉంది. దాంతో ఎన్నికల నోటిఫికేషన్ను సవరించి గడువు పొడిగించాల్సి ఉంటే దానికి అనుగుణంగానే ఎస్ఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎస్ఈసీతొలి విడతలో జరిగే అన్ని మునిసిపాలిటీలు కార్పోరేషన్లలో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేసింది అని చెబుతున్నారు.
ఎన్నికలు జరగకూడదనే :
ఇదిలా ఉంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు అసలు ఏపీలో జరగకూడదు అన్నదే వైసీపీ ఆలోచన అని కూటమి పార్టీలు ఆరోపించాయి. బుధవారం రాత్రి ఈ మేరకు కూటమి ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేసింది. టీడీపీ నుంచి చంద్రబాబు జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ ల సంతకంతో రిలీజ్ అయిన ఈ ప్రకటనలో హింసతో ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ చూస్తోంది అని కూటమి ఆరోపించింది. ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని సమగ్ర అభివృద్ధి జరుగుతుందని కూటమి పార్టీల అధినేతలు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఈ మూడు పార్టీల నాయకులు పేర్కొనడం విశేషం.
ఏం జరగనుంది :
మరో వైపు చూస్తే ఎస్ఈసీ తాత్కాలికంగా వాయిదా వేసిన తొలి విడత ఎన్నికలు మళ్ళీ ఎపుడు స్టార్ట్ చేస్తారు అన్నది అయితే చూడాలి. ఎందుకంటే ఆ వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. దాంతో ఆ ఎన్నికల తరువాత వీటిని నిర్వహిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా తొలి విడత ఎన్నికలు ఎంతో ఉత్సాహంగా మొదలైనా ఘర్షణలు తొలి రోజు నుంచే నామినేషన్ల ఘట్టంలో చోటు చేసుకోవడంతో పాటు ఇపుడు వాయిదా పడడంతో దీని మీదనే అంతటా చర్చ సాగుతోంది.