స్థానిక ఎన్నికల్లో గెలిస్తే...అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినట్లే !
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో ఎందుకో అతి పెద్ద రాజకీయ యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే మరో సార్వత్రిక ఎన్నికలను గుర్తు చేస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో ఎందుకో అతి పెద్ద రాజకీయ యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే మరో సార్వత్రిక ఎన్నికలను గుర్తు చేస్తున్నాయి. అది నిజమే మరి. ఏపీలో ఉన్న మొత్తం ఓటర్లు మరోసారి ఓటెత్తబోయే అతి పెద్ద ఎన్నిక ఇది. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకూ, అలాగే నగరాలలో అయితే మేయర్ దాకా ఈ ఎన్నికలు ఉంటాయి. అంటే పల్లె నుంచి పట్నం నగరం దాకా అంతా ఓటు వేస్తారు అన్న మాట. ఏపీలో సర్ ప్రక్రియకు ముందు తీసుకున్న ఓటర్ల జాబితాతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి నాలుగు కోట్లకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాలు పంచుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే ఇది చిన్న ఎన్నిక కానే కాదు.
గెలుపు కోసం :
స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం పెద్ద ఎత్తున పట్టు పడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. నిజానికి ఈ ఎన్నికలు స్థానిక స్వపరిపాలన కోసం ఏర్పాటు చేయబడిన వేదికలు. ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కూలదు, అలాగే అధికారాలు అంతకంటే తగ్గవు. కానీ ఎందుకు ఈ ఎన్నికల మీద అంత మోజు అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా ప్రభుత్వం పని తీరు మీద ప్రతిబింబిస్తాయి అన్నది ఉంది. ఏపీలో చూస్తే రెండున్నరేళ్ళు అవుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అందువల్ల ప్రజలలో ఉన్న అభిప్రాయం ఎంతో కొంత వెల్లడి అవుతుంది అన్నది ఉంది. ఒకవేళ విపక్షానికి ఎక్కువ సీట్లు వస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది వారు వ్యాప్తి చేసి 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తమకు అనుకూలం చేసుకుంటారు అన్నది అధికార పక్షం లో ఉన్న ఆందోళనగా చెబుతున్నారు.
విపక్షం పట్టు దేనికి :
ఇదే విధంగా చూస్తే విపక్షం కూడా ఆలోచిస్తోంది. ఏపీలో అధికార పార్టీకి జనంలో వ్యతిరేకత ఉందన్నది నిరూపించాలని తాపత్రయపడుతోంది. తాము ఎక్కువ సీట్లు గెలిచినా లేక తమ గ్రాఫ్ ఏ మాత్రం పెరిగినా దానిని జనంలో ఉంచి ఇక వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పుకోవాలని చూస్తోంది. దాంతోనే రాజకీయ ఆకాంక్షలు వ్యూహాలు అన్నీ కూడా స్థానిక ఎన్నికల చుట్టూ చేరిపోయి చాలా సాఫీగా సాగాల్సిన ఈ ఎన్నికల్లో రాద్ధాంతాన్ని రాజకీయ రచ్చను సృష్టిస్తున్నాయి. పల్లెలు పట్నాలను రెండుగా విడదీస్తున్నాయి. ఒకే చోట ఉన్న వారి మధ్య రాజకీయ చిచ్చు రాజేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్యను తీసుకుని వస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు పడుతున్నాయి. దీని వల్ల ఆయా పార్టీల మీద పిచ్చి అభిమానంతో ఒళ్ళు హూనం చేసుకున్న వారి జీవితాలే కేసులతో ఇబ్బంది పడతాయని అంటున్నారు.
అచ్చి రాదనే కదా :
ఒక్కసారి ఉమ్మడి ఏపీ కానీ విభజన ఏపీ కానీ రాజకీయ చరిత్ర తీసుకుంటే స్థానిక ఎన్నికల్లో గెలిచిన పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. 1981లో ఉమ్మడి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగితే అప్పటి కాంగ్రెస్ అన్ని సీట్లను గెలుచుకుంది. కానీ 1983లో టీడీపీ ప్రభంజనంలో పట్నాలూ పల్లెలూ అన్నీ కూడా సైకిలెక్కేశాయి. అలా టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక 1986లో టీడీపీ హయాంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఎన్టీఆర్ స్వయంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఊరూ వాడా తిరిగారు. ఆ ఎన్నికల్లో టీడీపీకే అన్ని సీట్లు వచ్చాయి. కొత్తగా మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు పెడితే అన్నింటా టీడీపీ గెలిచింది. కానీ 1989లో టీడీపీ తొలిసారిగా ఉమ్మడి ఏపీలో ఓటమి పాలు అయింది అన్నది గుర్తు చేస్తున్నారు.
అదే చరిత్ర రిపీట్ :
అంతే కాదు 1994లో టీడీపీ అధికారంలోకి వస్తే 1995లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొంత మార్పు కనిపించింది. అలా విశాఖ వంటి కార్పోరేషన్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే 1999లో టీడీపీయే మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది. 2001లో టీడీపీ స్థానిక ఎన్నికలు పెట్టి మెజారిటీ సీట్లను గెలుచుకుంది. కానీ 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు అయి చంద్రబాబు తొలిసారి మాజీ సీఎం అయ్యారు. ఇక 2006లో స్థానిక ఎన్నికలను వైఎస్సార్ జరిపించారు. అధికారంలో ఉంటూ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచినా 2009లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో బొటా బొటీగా 156 సీట్లను మాత్రమే గెలిచింది. అది కూడా ట్రయాంగిల్ పోటీ కాబట్టి బయటపడింది. ఇక 2013లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉండగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ 2014లో అటు ఏపీలో ఇటు తెలంగాణాలో అధికారంలోకి రాలేకపోయింది. 2021లో జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి 90 శాతం పైగా లోకల్ బాడీస్ ని వైసీపీ పరం అయ్యేలా చూశారు. కానీ 2024లో చూస్తే కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి దక్క్కాయి. దీనిని బట్టి చూస్తే అర్ధం అవుతోంది ఒక్కటే. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, సార్వత్రిక ఎన్నికలు వేరు. అందువల్ల వాటి విషయంలో రాజకీయ పార్టీలు అతి జోక్యం తగ్గిస్తేనే మేలు అంటున్నారు.