రెచ్చగొట్టే డిబేట్లకు చెక్.. టీవీ ఛానళ్లకు కేంద్రం హుకూం..
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వార్తలు, ప్రత్యేక చర్చలు డిబేట్లు, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేసే సమయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. వేగంగా వార్తలను అందించాలనే పోటీలో విశ్వసనీయతను కోల్పోకుండా.. ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా ఉండేందుకు ఈ అడ్వైజరీని తీసుకొచ్చింది.
దేశ భద్రతకు విఘాతం కలిగించే 'యాంటీ నేషనల్ కంటెంట్'ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయవద్దని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భద్రతా బలగాల కదలికలు, సున్నితమైన వివరాలను ప్రత్యక్ష ప్రసారం లైవ్ టెలికాస్ట్ చేయకూడదని పేర్కొంది. లైవ్ దృశ్యాలు ఉగ్రవాదులకు చేరితే భద్రతా బలగాల వ్యూహాలు దెబ్బతిని, జవాన్లు , పౌరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే దానిని నిర్ధారించుకుని ప్రసారం చేయాలి.
రెచ్చగొట్టే డిబేట్లు, టీఆర్పీ ప్రాధాన్యం వద్దు
టీఆర్పీ రేటింగ్స్ కోసం వార్తలను అతిశయోక్తిగా చూపించడం, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని కేంద్రం హెచ్చరించింది. రాజకీయ, మత, సామాజిక అంశాలపై చర్చలు నిర్వహించేటప్పుడు విద్వేషాలను పెంచే వ్యాఖ్యలు లేదా వ్యక్తిగత దూషణలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. భిన్నాభిప్రాయాలను తెలియజేయడం మీడియా బాధ్యత అయినప్పటికీ సామాజిక సామరస్యానికి భంగం కలగకూడదు.
లైంగిక దాడుల బాధితుల పేర్లు, ఫొటోలు, చిరునామాలు లేదా వారి గుర్తింపును వెల్లడించే ఎలాంటి దృశ్యాలను ప్రసారం చేయకూడదని తెలిపింది. అలాగే భారతదేశ పటాన్ని ప్రసారం చేసేటప్పుడు అధికారిక సరిహద్దులు కలిగిన మ్యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ఏఐ వినియోగంలో అప్రమత్తత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించిన నకిలీ వీడియోలు, మార్ఫింగ్ దృశ్యాలు, వాయిస్ ఆడియోలు ప్రజలను తప్పుదోవ పట్టించకుండా తగిన సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలని కేంద్రం తెలిపింది. ఏఐ కంటెంట్‌ను ప్రసారం చేసే ముందు దాని వాస్తవికతను నిర్ధారించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
మీడియాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, జాతీయ భద్రత, సామాజిక బాధ్యత కూడా అంతే కీలకమని కేంద్రం ఈ సూచనల ద్వారా స్పష్టం చేసింది.