"బాస్‌.. అట్లాంటిక్‌కి నా పేరు పెడదాం''.. ట్రంప్‌ డిమాండ్‌.. "సారీ సార్.. మ్యాప్ పగిలిపోతుంది" అన్న సుందర్ పిచాయ్

అయితే ఈసారి ఏకంగా అట్లాంటిక్ మహాసముద్రానికే తన పేరు పెట్టేసి గూగుల్ మ్యాప్స్‌లో లైవ్‌లో పెట్టేద్దామని ఆయన చేసిన ప్లాన్‌కి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గట్టిగానే బ్రేకులు వేశారు

Update: 2026-10-22 04:54 GMT

భూగోళంపై ఉన్న ప్రతీదాంట్లో తన మార్కు ఉండాలనుకోవడం డొనాల్డ్ ట్రంప్‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఏకంగా అట్లాంటిక్ మహాసముద్రానికే తన పేరు పెట్టేసి గూగుల్ మ్యాప్స్‌లో లైవ్‌లో పెట్టేద్దామని ఆయన చేసిన ప్లాన్‌కి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గట్టిగానే బ్రేకులు వేశారు. అట్లాంటిక్‌కి ‘ట్రంప్ సముద్రం’ అని పేరు మార్చేద్దామని నేరుగా పిచాయ్‌కే ఫోన్ కొట్టి అడిగితే.. "సార్.. సముద్రం పబ్లిక్ ప్రాపర్టీ.. ఏ ఒక్కరి అబ్బా సొత్తూ కాదు.. పక్కకి జరిగి ఆడుకోండి" అని సీఈవో రెస్పెక్ట్‌ఫుల్‌గా నూరిపోశారట. దాంతో వేరే దారి లేక "పోతే పోయింది లే.. అట్లాంటిక్ పేరే ఉంచుకోండి" అంటూ ట్రంప్ ఉదారంగా ఆ ఆలోచనను విరమించుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పూయిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. వేదిక ఏదైనా.. విషయం ఏదైనా సరే.. రాజకీయాలు, వాణిజ్యం నుంచి అంతర్జాతీయ అంశాల వరకు తనదైన చమత్కారాన్ని, హాస్యాన్ని జోడించి మాట్లాడటం ట్రంప్‌కు అలవాటే. ఈ క్రమంలోనే అట్లాంటిక్ మహాసముద్రం పేరు మార్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, అంతర్జాతీయ డిజిటల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి.

గూగుల్ మ్యాప్స్.. సుందర్ పిచాయ్‌తో ఫోన్ కాల్

అట్లాంటిక్ సముద్రానికి తన పేరు పెట్టాలనే ఆలోచన తనకు వచ్చిందని, అయితే ఆ ఆలోచనను చివరకు విరమించుకున్నానని ట్రంప్ సరదాగా వెల్లడించారు. ఈ ప్రతిపాదనను అమలు చేయడం కోసం తాను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను నేరుగా సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. గూగుల్ మ్యాప్స్‌లో అట్లాంటిక్ సముద్రం పేరును మార్చాలని పిచాయ్‌ను కోరగా.. ఆయన అందుకు సున్నితంగా తిరస్కరించారని ట్రంప్ తెలిపారు.

సముద్రాలు, మహాసముద్రాలు కేవలం ఒక దేశ పరిధికి మాత్రమే పరిమితమైనవి కాదని, అవి అనేక దేశాల భౌగోళిక పరిధులు, అంతర్జాతీయ వాణిజ్య రవాణా, భద్రత, చారిత్రక అంశాలతో ముడిపడి ఉంటాయని పిచాయ్ తనకు వివరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న మహాసముద్రాల పేర్లను మార్చడం అంత సులభం కాదని, దయచేసి తనను అలాంటి కోరికలు కోరవద్దని పిచాయ్ కోరినట్లు ట్రంప్ హాస్యభరితంగా వ్యాఖ్యానించారు. దీంతో తాను కూడా స్పందిస్తూ.. ‘సరేలే.. అలాగే ఉండనివ్వండి’ అని చెప్తూ ఆ ఆలోచనను పక్కన పెట్టేశానని వివరించారు.

భౌగోళిక పేర్ల మార్పు అంత తేలిక కాదు

ట్రంప్ ఈ విషయాలను సరదాగా ప్రస్తావించినప్పటికీ సాంకేతికంగా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మహాసముద్రాల పేర్లు మార్చడం అనేది ఒక్క వ్యక్తి లేదా ఒక్క డిజిటల్ సంస్థ చేతుల్లో ఉండే నిర్ణయం కాదు. సముద్రాల పేర్లకు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ సంస్థలు, వివిధ దేశాల ఆమోదం తప్పనిసరి. గూగుల్ మ్యాప్స్‌లో ప్రదేశాల పేర్లు కనిపించడానికి అధికారిక భౌగోళిక రికార్డులు, అంతర్జాతీయ ఒప్పందాలే ప్రామాణికం. గూగుల్ సీఈవో వ్యక్తిగత నిర్ణయంతో వీటిని మార్చడం సాధ్యపడదు.

సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే గూగుల్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనను ట్రంప్ కోరిన వ్యాఖ్యలు నెటిజన్లను విశేషంగా అలరిస్తున్నాయి. అట్లాంటిక్ సముద్రం లాంటి కీలక మహాసముద్రం పేరు మార్పుపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కేవలం ఆయన మార్క్ హాస్యంగానే చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News