నారాయ‌ణా... ఇదెక్క‌డి స్వామి భ‌క్తి?

Update: 2018-04-02 11:40 GMT
ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రులు కేబినెట్ ర‌థ సార‌థిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని నిత్యం స్మ‌రిస్తూనే ఉండాలి. ఎందుకంటే... స్వామి భ‌క్తి మెండుగా క‌లిగిన వాళ్ల‌కే బాబు స‌ర్కారులో మంచి ప‌ద‌వులు ద‌క్కుతాయి మ‌రి. ఇది ఇప్ప‌టి మాటేమీ కాదులెండి. గ‌తంలో పిల్ల‌నిచ్చిన మామ దివంగ‌త ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయ‌న చేతిలోని అధికారాన్ని లాగేసుకున్న నాటి నుంచి కూడా బాబుది ఇదే వైఖరి అన్న వాద‌న లేక‌పోలేదు.  బాబులోని ఈ వెరైటీ ల‌క్ష‌ణం కారణంగానే టీడీపీ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్న చాలా మంది నేత‌లు ఆ త‌ర్వాత పార్టీని వీడారన్న ఉదాహ‌ర‌ణ‌లు కూడా లేక‌పోలేదు. అయినా ఇప్పుడు ఓ ప‌క్క ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఉధృతంగా ఉద్యమం సాగుతుంటే ఇదెక్క‌డి గోల అంటారా? అయితే టీడీపీ నేత‌ - చంద్ర‌బాబు కేబినెట్ లో బాబు త‌ర్వాత అంత‌టి కీల‌క ప్రాధాన్య‌మున్న మంత్రి నారాయ‌ణ కార్యాల‌యానికి వెళితే మాత్రం ఈ స్వామి భ‌క్తిని ప్ర‌స్తావించుకోకుండా ఉండ‌లేమ‌న్న వాద‌న వినిపిస్తోంది.

నిజంగానా? అంటే... నిజ‌మేన‌ట‌. అయినా నారాయ‌ణ ఆఫీస్ కు వెళితే  ఏం క‌నిపిస్తుంద‌న్న విష‌యానికి వ‌స్తే... నారాయ‌ణ కార్యాల‌యానికి వెళితే ఆయ‌న కుర్చీ వెనుకాల గోడ‌పై టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడి హోదాలో ఉన్న స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఫొటో - దాని ప‌క్క‌నే కేబినెట్ ర‌థ‌సార‌థిగా హోదాలో ఉన్న సీఎం చంద్రబాబు ఫొటో క‌నిపిస్తుంది. అక్క‌డితో ఆగితే బాగుంటుంది. అయినా ఎన్టీఆర్ - చంద్ర‌బాబు ఫొటోల ప‌క్క‌నే వారి కంటే కూడా మెరిసిపోతున్న తీరుగా చంద్ర‌బాబు త‌న‌యుడు, ఆయ‌న కేబినెట్ లోని కుర్ర మినిస్ట‌ర్ నారా లోకేశ్ ఫొటో క‌నిపిస్తుంది. సాధార‌ణంగా అయితే త‌మ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడితో పాటుగా ప్ర‌స్తుత పార్టీ అధ్య‌క్షుడు - కేబినెట్ ర‌థ‌సార‌థిగా ఉన్న వారి ఫొటోల‌తోనే ఎవ‌రైనా స‌రిపెడ‌తారు. మ‌రి నారాయ‌ణ ఎన్టీఆర్‌ - చంద్ర‌బాబు ఫొటోల‌తో పాటుగా లోకేశ్ ఫొటోను ఎందుకు త‌గిలించార‌న్న ప్ర‌శ్న త‌ప్ప‌నిస‌రిగా త‌లెత్తుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. చంద్ర‌బాబు కేబినెట్ లో కేవ‌లం నారాయ‌ణ ఒక్క‌రే మంత్రి కాదు. నారాయ‌ణతో పాటు చాలా మంది సీనియ‌ర్లు మంత్రులుగా ఉన్నారు.

నారాయ‌ణ నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చారు గానీ... పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో కొన‌సాగుతున్న వారు కూడా ఇప్పుడు బాబు కేబినెట్ లోనే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగానూ ఉన్నారు. ఈ లెక్క‌న వీరంతా కూడా నారాయ‌ణ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే... లేద‌నే చెప్పాలి. మ‌రి నారాయ‌ణ త‌న కార్యాల‌యంలో త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడుగా ఉన్న లోకేశ్ ఫొటోను ఎందుకు పెట్టుకున్న‌ట్టు?  దీనికి స‌మాధానమే స్వామి భ‌క్తి అన్న మాట వినిపిస్తోంది. నారాయ‌ణ‌కు ఉన్న స్వామి భ‌క్తి ముందు ఇత‌రులంతా బ‌లాదూరేన‌న్న మాట వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ అధిష్ఠానాన్ని మ‌రింతగా ప్ర‌సన్నం చేసుకునేందుకే నారాయ‌ణ‌... ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ఫొటోల ప‌క్క‌న లోకేశ్ ఫొటో పెట్టుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి దీనికి నారాయ‌ణ ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News