ఇరాన్ తో యుద్దం.. ట్రంప్ పెద్ద కొడుక్కి నచ్చలేదా?
ఆసక్తికర కథనం ఒకటి అమెరికాలో పేరు మోసిన ఏజ్ ఓల్డ్ మీడియా హౌస్ ఒకటి పబ్లిష్ చేసింది.
ఆసక్తికర కథనం ఒకటి అమెరికాలో పేరు మోసిన ఏజ్ ఓల్డ్ మీడియా హౌస్ ఒకటి పబ్లిష్ చేసింది. ఈ కథనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రత్యేక కథనం సారాంశం ఏమంటే.. ఇరాన్ తో అమెరికా చేస్తున్న యుద్ధానికి కర్త.. కర్మ.. క్రియ మొత్తం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే.. తన తండ్రి చేస్తున్న యుద్ధానికి ఆయన పెద్ద కొడుక్కి నచ్చట్లేదంటూ అమెరికాలో అత్యంత విశ్వసనీయమైన మీడియా సంస్థగా పేరున్న ది అట్లాంటిక్ తాజాగా పబ్లిష్ చేసిన కథనం సంచలనంగా మారింది. ఇరాన్ తో యుద్ధంపై తనకున్న అభ్యంతరాల్ని తన తండ్రి ట్రంప్ తో ఆయన పెద్ద కొడుకు స్పష్టం చేశాడని పేర్కొన్నారు. అయితే.. ఇదంతా ప్రైవేటు సంభాషణల సమయంలో చోటు చేసుకున్నట్లుగ సదరు కథనంలో పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ యుద్ధాల కంటే స్వదేశీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ మద్దతుదారుల్లోనూ ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. 2024 అధ్యక్షఎన్నికల ప్రచారంలో అమెరికా మరో మధ్యప్రాచ్య యుద్దంలోకి తీసుకెళ్లవద్దని ట్రంప్ ను కోరినట్లుగా చెబుతున్నారు. ఒక్క ట్రంప్ పెద్ద కొడుకు మాత్రమే కాదు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో సమా పలువురు ఉన్నతాధికారులు సైతం ఇరాన్ తో యుద్ధంపై ప్రైవేటుగా సందేహాలు వ్యక్తం చేసినట్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు.. వైమానిక దాడులతోనే ఇరాన్ ప్రభుత్వ మార్పు సాధ్యమా? అన్న అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్.. విదేశాంత మంత్రి మార్కో రూబియోకు సందేహాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇరాన్ తో చేస్తున్న యుద్ధంపై అమెరికాలోని 65 శాతం మంది ట్రంప్ తీరును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్యూ రీసెర్చ్ సర్వే వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం ఏడాది పాటు సాగే వీలుందన్న అంచనాలకు మద్దతు పెరుగుతోంది. ఈ సంచలన కథనాన్ని ప్రచురించిన 'ది అట్లాంటిక్' విషయానికి వస్తే.. ఈ మీడియా సంస్థ అమెరికాలో 1857 నుంచి నడుస్తోంది. వార్తల విశ్వసనీయత విషయంలో కచ్చితత్వం ఎక్కువ.
తమ వద్ద సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తల్ని ఈ మీడియా సంస్థ పబ్లిష్ చేయదన్న నమ్మకం అమెరికన్లలో అత్యధికులు విశ్వసిస్తారు. లెఫ్ట సెంటర్ గా ఈ మీడియా సంస్థ కథనాలు ఉంటాయన్న పేరుంది. ట్రంప్ పాలన మీదా.. రిపబ్లికన్ విధానాలపై తరచూ విమర్శనాత్మకంగా కథనాల్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. తాజా కథనం విషయానికి వస్తే.. ట్రంప్ పెద్ద కొడుకు (డొనాల్డ్ ట్రంప్ జూనియర్) తనకు సన్నిహితులైన ఇద్దరితో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా ఈ కథనంలో పేర్కొన్నారు.
ఇరాన్ తో అమెరికా చేస్తున్న యుద్ధాన్ని ప్రైవేటు సంభాషణల్లో వ్యతిరేకిస్తున్న ట్రంప్ పెద్ద కొడుకు.. బహిరంగంగా మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. కుటుంబ ప్రయోజనాలు.. ప్రభుత్వ ప్రతిష్ఠను పరిగణలోకి తీసుకొని ఈ విషయాల్ని బహిరంగంగా ఎక్కడా మాట్లాడటం లేదు. ఈ కథనంపై ట్రంప్ కుమారుడు స్పందించలేదు.అయితే.. వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఇరాన్ తో యుద్ధం చాలా త్వరలోనే ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ జూనియర్ కు మొదట్నించి కూడా అమెరికా విదేశీ వ్యవహారాల్లోనూ..యుద్ధాల్లో జోక్యం చేసుకోవటంపై ఆయనకు ఇష్టం ఉండదు. ఇదే అంశాన్ని తమ కథనంలో కీలకంగా ప్రస్తావించారు. ఇందుకు గతంలో ఆయన వ్యవహారశైలిగా ప్రస్తావించటం గమనార్హం.