ఫేస్ బుక్ కు రూ.2.3లక్షల కోట్ల జరిమానా? అసలీ కేసేంటి?

అమెరికా దేశ చరిత్రలోనే ఒక కంపెనీకి రూ.2.3లక్షల కోట్ల ఫైన్ విధించిన సంచలనం చోటు చేసుకుంది.

Update: 2026-10-22 08:00 GMT

అమెరికా దేశ చరిత్రలోనే ఒక కంపెనీకి రూ.2.3లక్షల కోట్ల ఫైన్ విధించిన సంచలనం చోటు చేసుకుంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్ బుక్) కు న్యూమెక్సికో కోర్టు 25 బిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో సుమారు రూ.2.1 లక్షల కోట్ల నుంచి రూ.2.3 లక్షల కోట్లు) జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అక్టోబరు 21న వెలువడిన ఈ తీర్పు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్ గా మారింది. డేటా గోప్యత విషయంలో యూజర్లను తప్పుదారి పట్టించినందుకు ఈ భారీ ఫైన్ పడింది. ఇంతకూ ఈ కేసేంటి? ఇంత భారీ జరిమానా ఎందుకు విధించారు? ఈ కేసు వేసిన వారు ఎవరు? తాజా తీర్పు నేపథ్యంలో ఏం జరగనుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

అసలీ కేసేంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నిక వేళ (2016) ఇప్పటి మెటా అప్పటి ఫేస్ బుక్ వినియోగదారుల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటిగా సంస్థ సేకరించి.. పొలిటికల్ ప్రచారానికి దుర్వినియోగం చేసిందన్నది కీలక ఆరోపణ. కేంబ్రిడ్జ్ అనలిటిగా ఒక బ్రిటిష్ కన్సల్టింగ్ సంస్థ. లండన్ కేంద్రంగా సాగే ఈ బ్రిటిష్ పొలిటికల్ డేటా కన్సల్టింగ్ సంస్థ 2013లో ప్రారంభమైంది. వివిధ దేశాల ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకోవటానికి ఈ సంస్థ పని చేస్తుంది.

సోషల్ మీడియా నుంచి ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. వారి ప్రవర్తన వివరాల్ని సేకరించి.. అందుకు తగ్గట్లు రాజకీయ ప్రకటనల్ని రూపొందించటం.. ఓటర్లను ప్రభావితం చేయటం దీని ప్రధాన వ్యాపారం. ఈ సంస్థ ఎత్తుగడల కారణంగా 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు.. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవటానికి కారణమైన బ్రిక్సిట్ ప్రచారంలోనూ కీలక భూమిక పోషించింది. అంతేకాదు ఫేస్ బుక్ లో ఒక చిన్న క్విజ్ యాప్ ద్వారా కోట్లాది మంది డేటాను దొంగలించిన వైనాన్ని 2018లో గుర్తించారు.

డేటా ఎలా బయటకు వచ్చింది?

ఫేస్ బుక్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ అక్రమంగా పొంచింది. అయితే.. ఈ డేటా లీక్ ను అడ్డుకోవటంలోనూ.. యూర్ల విలువైన వివరాలు బయటకు వెళ్లేందుకు కారణమైన ఫేస్ బుక్ నిర్లక్ష్యానికి ప్రతిగా భారీగా ఫైన్లు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఈ సంస్థ కారణంగా రూ.2.63 లక్షల కోట్ల ఫైన్లు పడగా.. ఇప్పటివరకు సెటిల్ మెంట్లలో భాగంగా ఫేస్ బుక్ రూ.9950 కోట్ల చెల్లింపులు జరిపింది. మిగిలిన కేసులు అప్పీలు.. పెండింగ్ లో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సంస్థ సంగతేంటి?

ఫేస్ బుక్ కు ఇంత భారీ ఆర్థిక నష్టానికి గురి చేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ విషయానికి వస్తే.. వీరి స్కాం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారటం.. చట్టపరమైన ఇబ్బందులు ఎక్కువ కావటంతో ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక 2018లోనే ఈ సంస్థ తన వ్యాపారాలను పూర్తిగా మూసేసి.. దివాలా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఉనికిలో లేదు.

కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ అధినేత ఎవరు? వారిప్పుడు ఎక్కడ?

ఇక్కడో ఆసక్తికర అంశాల్ని చెప్పాల్సి వస్తుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ అధినేతలుగా అమెరికాలో అత్యంత సంపన్నులైన రాబర్ట్ మర్చర్ ఫ్యామిలీ. వీరు ఈ సంస్థలో పెట్టిన పెట్టుబడి రూ.42 కోట్లు మాత్రమే. సంచలన వివాదాల నేపథ్యంలో సంస్థను మూసేయటంతో ఆర్థిక నష్టంగా రూ.42 కోట్లుగా కనిపిస్తుంది. కానీ.. వారి తాజా ఆస్తుల విలువ రూ.12వేల కోట్లకు పైనే. కాకుంటే కంపెనీ మీద ఉండే కేసులు.. వ్యక్తిగతంగా వెంటాడవు. దీంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకుంటే.. రాబర్ట్ మర్చర్ కుటుంబానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కు భారీ నష్టం వాటిల్లింది.

ప్రస్తుతం వారేం చేస్తున్నారు?

డిజిటల్ డేటా వ్యాపారాన్ని తగ్గించేసిన రాబర్ట్ మర్చర్ ఫ్యామిలీ ప్రస్తుతం అమెరికాలోని రిపబ్లికన్లకు.. పబ్లికేషన్లకు.. వివిధ స్వచ్చంద సంస్థలకు బ్యాక్ ఎండ్ ఫండింగ్ భారీగా ఇస్తున్నారు. అమెరికాలో ఈ వ్యాపారం చట్టబద్ధమైనది. వీరి వ్యాపారం ఎక్కువగా హెడ్జ్ ఫండ్స్.. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు.. ఫౌండేషన్లుగా చెబుతారు.

న్యూమెక్సికో వేసిన కేసేంటి?

ఈ స్కాం వెలుగు చూసిన తర్వాత డేటా దుర్వినియోగం కావటానికి కారణమైన ఫేస్ బుక్ మీద కేసు వేసింది. ఈ కుంభకోణం వెలుగు చేసిన తర్వాత ఫేస్ బుక్ స్పందిస్తూ.. తమ అంతర్గత భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరుపుతామని పేర్కొంది. అయితే.. ఫేస్ బుక్ ఆ మాటను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ 2021లో న్యూమెక్సికో అటార్నీ జనరల్ హెక్టార్ బెల్డెరాస్ (ఇప్పుడు ఆయన ఈ పదవిలో లేరు) కోర్టులో కేసు వేశారు.

ఎవరీ హెక్టార్ బాల్డెరాస్? ఇప్పుడు ఎక్కడ?

అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయవాది.. రాజకీయ నాయకుడు. న్యూమెక్సికోలోని ఒక వెనుకబడిన ప్రాంతంలో సింగిల్ మదర్ సంరక్షణలో పెరిగిన వ్యక్తి. ప్రభుత్వ సాయంతో పెరిగి.. పట్టుదలతో లా పట్టా సాధించారు. 2015-22 వరకు వరుసగా రెండుసార్లు న్యూమెక్సికో అటార్నీ జనరల్ గా సేవలు అందించారు. అంతుకు ముందు న్యూమెక్సికో స్టేట్ ఆడిటర్ గా పని చేశారు. 2022 చివర్లో అటార్నీ జనరల్ గా పదవీకాలం ముగిసిన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి బయటకు వచ్చి కార్పొరేట్ రంగంలోకి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం నార్తర్న్ న్యూమెక్సికో కాలేజ్ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘టీఏసీ ఇన్ఫోసెక్ లిమిటెడ్’ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తాజా తీర్పు ఎలా?

మెటాపై ఈ కేసును మాజీ అటార్నీ జనరల్ హెక్టార్ బాల్డెరాస్ ప్రారంభించినా.. దాన్ని తర్వాతి కాలంలో ముందుకు తీసుకెళ్లి.. తాజాగా సంచలన తీర్పునకు కారణం మాత్రం అటార్నీ జనరల్ రౌల్ తోరెజ్. ఇక్కడ ఈ పెద్ద మనిషి గురించి కాస్త చెప్పాలి. ఈ స్కాం వెలుగు చూసినప్పుడు అమెరికాలోని ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఒక గ్రూప్ గా మెటాపై పోరాడాలని భావించాయి.అయితే.. ఆ గ్రూప్ నుంచి హెక్టార్ బాల్డెరాస్ మాత్రం విడిపోయి.. ఒంటరిగా స్వతంత్ర న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. దీంతో.. ఈ రోజు న్యూమెక్సికోకు యాభై రెట్లు ఎక్కువ ఫైన్ దక్కింది. ఈ కారణంగానే ఇప్పుడు అత్యంత భారీ ఫైన్ కోర్టు విధించేందుకు కారణం కావటమే కాదు.. ఆ భారీ మొత్తం న్యూమెక్సికో కు దక్కనుంది.

తాజా తీర్పుపై ఆయన స్పందనేంటి?

తాజా జరిమానా సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు స్పష్టమైన హెచ్చరికగా పేర్కొన్నారు. ఎంతటి అగ్రశ్రేణి కంపెనీ అయినా వినియోగదారులుమోసం చేస్తే చట్టం ముందుకు వారు మోకరిల్లాల్సిందేనని స్పష్టం చేశారు. న్యూమెక్సికో పౌరుల హక్కులను కాలరాస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. అమెరికా న్యాయ చరిత్రలోనే ఒక రాష్ట్రం ఒంటరిగా పోరాడి.. ఒక కార్పొరేట్ సంస్థపై సాధించిన అతి భారీ విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

మెటా ఇప్పుడేం చేయనుంది?

ప్రస్తుతం ఈ కేసులో ప్రతికూలమైన తీర్పును ఎదుర్కొన్న మోటా.. అప్పీల్ కు వెళ్లనున్నట్లుగా వెల్లడించింది. తీర్పు వెలువడిన వెంటనే మెటా చీఫ్ లీగల్ అధికారి సీజే మహోనీ స్పందిస్తూ.. తాము ఈ కేసుపై అప్పీల్ కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. దీంతో.. ఈ కేసు తదుపరి తీర్పు రావటానికి కనీసం 2-5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. రెండు పక్షాల లాయర్లు ఉన్నత కోర్టులో మళ్లీ సుదీర్ఘమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుంది?

అప్పీల్ ఓడితే ఏమవుతుంది?

ఒకవేళ అప్పీల్ కోర్టులో మెటా ఓడిపోతే.. ఫైన్ తో పాటు భారీ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో మెటా బలమైన వాదనకు ఉన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే కేసును పూర్తిగా కొట్టివేసే వీలుంది. లేదంటే.. ఫైన్ మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంది. తాజా పరిణామాల్ని చూస్తే.. మెటా లాయర్లు జరిమానా మొత్తాన్ని తగ్గించుకోవటమే ప్రధాన లక్ష్యంగా అప్పీల్ ఉందంటున్నారు. మరోవైపు న్యూమెక్సికో ప్రభుత్వం మాత్రం మెటాను పక్కా ఆధారాలతో ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News