వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేది ఎక్కడ నుంచో చెప్పేసిన లోకేశ్

Update: 2021-10-23 05:30 GMT
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేయటం తెలిసిందే. ఈ దీక్ష సందర్భంగా పలువురు నేతలు హాజరు కావటం.. ప్రసంగాలతో హోరెత్తించటం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేశ్.. దీక్షలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక ప్రకటన ఒకటి వచ్చింది. 2024 ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని చెప్పేశారు.

ప్రత్యక్ష ఎన్నికల నుంచి కాకుండా పరోక్ష ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా లోకేశ్ ను ప్రజాజీవితంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు.. ఆయనకు ఎమ్మెల్సీ హోదాలో మంత్రి పదవిని అప్పజెప్పారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేశ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనకు ఎంతమాత్రం సూట్ కాని నియోజకవర్గంగా పలువురు భావించారు. ఆయన్ను పోటీ చేయొద్దని కోరారు కూడా.

అయినప్పటికి మంగళగిరిలో పోటీ చేసిన ఆయన.. ఓటమి పాలయ్యారు. దీంతో.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమితో.. లోకేశ్ తన నియోజకవర్గాన్ని మార్చుకుంటారన్న ప్రచారం సాగింది. గెలుపునకు ఏ మాత్రం ఢోకా లేని నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతారని భావించారు. అందుకు భిన్నంగా తాజాగా మాట్లాడిన లోకేశ్.. తాను వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి.. గెలిచి కానుకగా పార్టీకి ఇస్తానని వ్యాఖ్యానించారు.

వైసీపీకి తాము ట్రైలర్ మాత్రమే చూపించామని.. త్వరలో సినిమా చూపిస్తామన్న ఘాటు వ్యాఖ్య చేసిన లోకేశ్.. గతంలోనూ ప్రధాని మోడీ  మీద ఇదే తరహా వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అలాంటి హెచ్చరికనే మళ్లీ చేయటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ఇదిలా ఉన్నా.. 2024లో లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గం ఏమిటన్న దానిపై ఒక స్పష్టత ఇచ్చిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News