బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు.. నారా లోకేశ్ ఫైర్‌

Update: 2022-06-12 15:30 GMT
బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు, మోసాలకు అడ్డూ అదుపు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని.. ఎన్నికల తరువాత రాష్ట్రాన్ని సంపూర్ణ మద్యపానప్రదేశ్గా మార్చారని విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ, మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ.8300 కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు. జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని గొప్పలు పోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మద్యం రాబడినే హామీగా పెట్టి వేల కోట్ల అప్పులు చేస్తోంది. తాజాగా ఒకేసారి రూ.8,300 కోట్ల రుణం తెచ్చి.. మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది. భవిష్యత్తులో మద్యనిషేధం విధించాలంటే ముందు ఈ అప్పులన్నీ తీర్చాలి. ఆర్థిక భారంతో అతలాకుతలమవుతున్న ప్రభుత్వం ఈ అప్పులు ఎప్పటికి తీరుస్తుంది.. మద్యనిషేధం ఎప్పటికి అమలు చేస్తుందన్నది అంతుచిక్కని ప్రశ్నే.  అని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే అప్పులకుప్పలా మారిన రాష్ట్రంపై మరో గుదిబండ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయా న్ని చూపి తాజాగా రూ.8,300 కోట్ల రుణాన్ని సమీకరించింది. ప్రభుత్వ ఆదాయాన్ని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ ఆదాయాన్ని ఎస్క్రో చేసి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్న అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఈ అప్పు తేవడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితితో సంబంధం లేకుండా బయట నుంచి కార్పొరేషన్‌ పేరుతో అప్పు తీసుకోవడంపైనా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. అని లోకేశ్ అన్నారు.

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యంపై ప్రత్యేక మార్జిన్‌ విధించి, వసూలు చేసుకునేలా ప్రభుత్వం చట్టసవరణ చేసిందని తెలిపారు. ఇలా వసూలు చేసిన మొత్తం ఆ కార్పొరేషన్‌ ఆదాయమేననీ చట్టంలో పేర్కొందన్నారు. అంతకు ముందే ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ను తగ్గిస్తూ చట్ట సవరణ తెచ్చింది. ప్రభుత్వానికి వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక మార్జిన్‌గా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడం వివాదాస్పదమవుతోందన‌ని చెప్పారు. తనకు ప్రత్యేక మార్జిన్‌ రూపంలో ఇంత ఆదాయం వస్తోందని చూపిస్తూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ రుణాలు సమీకరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News