జ‌గ‌న్ స‌ర్కారుపై చిన‌జీయ‌ర్ కామెడీ కామెంట్లు.. నారా లోకేష్ రియాక్షన్ ఏంటంటే

Update: 2022-05-19 14:30 GMT
జీయ‌ర్ సంస్థ‌ల అధినేత‌, రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి.. స‌మ‌తా త‌త్వాన్నిప్ర‌చారం చేస్తున్న చిన్న జీయ‌ర్ స్వామి.. రాజ‌కీయంగా కూడా.. ఆస‌క్తిగా మారిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న తెలంగాణ‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వంపై సునిశిత‌, లోతైన విమ‌ర్శ‌లు సంధించారు. అది కూడా మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్ల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రిచిపోక ముందే.. చినజీయ‌ర్‌.. త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించి.. జ‌గ‌న్ స‌ర్కారుకు చుర‌క‌లంటించారు.

భక్తులను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్న సమయంలో.. చిన‌జీయ‌ర్ స్వామి ప్రయాణం గురించి వివరించా రు. ఈ సందర్భంగా.. ఏపీలో రహదారుల పరిస్థితిపై చినజీయర్‌ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చని, ఒక్కోసారి గొతులు ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. తాము జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వరకు ప్రయాణించామని, ఆ అనుభవం చాలా బాగుందని వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ మ‌ర‌పురాని ఘ‌ట్టం.. చక్క‌ని జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు.

``ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండవచ్చు. ఒక్కోసారి గోతులు ఎక్కువ ఉండవచ్చు. మేం జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేట్టు ఉంది" అని చినజీయర్ స్వామి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

నారా లోకేష్ కౌంట‌ర్ ఇదే!

రాష్ట్రంలోని ర‌హ‌దారుల దుస్థితిపై.. చిన‌జీయ‌ర్ స్వామి ఆవేద‌న‌తో స్పందించారని.. టీడీపీ జాతీయ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్రవ‌రం వరకూ సాగిన తమ ప్రయాణంపై.. చినజీయర్ స్వామి వ్యంగ్య బాణాలు సంధించిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.  ఈ సంద‌ర్భంగా రోడ్ల‌పై చిన‌ జీయ‌ర్ స్వామి ఆవేద‌న‌తో స్పందించారని  అన్నారు.

గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి జీయర్ స్వామి ప్రస్తావించిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు. చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలతో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోందని లోకేష్ ట్విటర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

ప‌క్కరాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న రాష్ట్రాన్ని చూపిస్తున్నారని, అయినా ప్రభుత్వ స్పంద‌న శూన్యమని లోకేశ్‌ ధ్వజ మెత్తారు. మ‌రి ఇటీవ‌ల హైద‌రాబాద్ వెళ్లి మ‌రీ.. చిన‌జీయ‌ర్‌ను పొగిడిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News