నాడు వ‌ద్ద‌ని.. రంకెలేసిన కంపెనీకే.. నేడు రిబ్బ‌న్ క‌టింగా? జ‌గ‌న్‌పై లోకేష్ ఫైర్‌

Update: 2022-05-18 02:30 GMT
గతంలో గ్రీన్కో ఎన‌ర్జీ కంపెనీ విషయంలో అవినీతి జ‌రిగిందంటూ.. టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేసిన జగన్.. ఇప్పుడు అదే కంపెనీకి రిబ్బన్ కట్ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ ఎన్ని విమర్శలు చేసినా.. ఆఖరికి ఆయన బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆఖరికి జగన్‌రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.

గతంలో గ్రీన్‌కో ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అదే కంపె నీకి రిబ్బన్‌ కట్‌ చేసి.. తమపై చేసిన ఆరోపణలన్నీ అవకాశవాద రాజకీయం కోసమేనని జగనే స్వయంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇందుకు జగన్ రెడ్డికి థాంక్స్ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

జ‌గ‌న్ ఏం చేశారంటే..

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో.. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్‌కో) ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఒకే యూనిట్లో సౌర, పవన, హైడల్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని.. సీఎం జగన్ వివరించారు. శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని తగ్గించే ఈ ప్రాజెక్టు దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని వ్యాఖ్యానించారు. మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

``ఈ ప్రాజెక్టు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నాం. ఇందులో పంప్డ్‌ స్టోరేజీ, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఒకేచోట చేయవచ్చు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో కొంతమేర సౌర, పవన విద్యుత్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. విద్యుత్‌కు డిమాండ్‌ ఉన్న సమయంలో ఆ నీటి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తారు. నిరంతరం పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ ప్రాజెక్టు.. భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు అమలు చేసేందుకు ఆదర్శంగా ఉంటుంది`` అని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

గ‌తంలో ఏమ‌న్నారంటే..

శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తి తగ్గి పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుందని చెప్పారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు.. దేశానికి సరికొత్త మార్గం చూపుతుందన్నారు సీఎం జ‌గ‌న్‌. అయితే.. గ‌తంలో ఇదేప్రాజెక్టును తీసుకువ‌చ్చేందుకు అప్ప‌టి టీడీపీ హ‌యాంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే.. దీనిపై అసెంబ్లీలో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ``కేవ‌లం మూడేమూడు కంపెనీల‌తో చంద్ర‌బాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో గ్రీన్‌కో ఎన‌ర్జీ ఉంది. మ‌రొక‌టి మిత్ర‌, ఇంకొక‌టి రెన్యూ. అంటే ఎంత అవినీతి జ‌రిగిందో తెలుస్తుంది`` అని విరుచుకుప‌డ్డారు. అయితే.. ఇప్పుడు అదే గ్రీన్‌కో కంపెనీకి ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. మ‌రి దీనిని వైసీపీ నాయ‌కులు ఎలా స‌మ‌ర్ధించుకుంటారో చూడాలి.
Tags:    

Similar News