మోడీ ప్రోగ్రాం కోసం ముస్లింలు భూమి ఇచ్చారు

Update: 2016-05-26 18:08 GMT
వినేందుకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. ఇది నిజం. ఆసక్తి కలిగించే ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తమ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా యూపీలో ఒక భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా మోడీకి యూపీనే ఎందుకు గుర్తుకు వచ్చిందంటే కారణం లేకపోలేదు. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే.. దానికి కొద్ది నెలల ముందు నుంచే తరచూ ఆ రాష్ట్రానికి వెళ్లటం.. ఆ రాష్ట్రంపై ప్రేమను ప్రదర్శించటం.. ముద్దు ముద్దు మాటలు మాట్లాడటం మోడీకి అలవాటే. అయితే.. ఈ వ్యూహం కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయితే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ కావటం తెలిసిందే. తాజాగా తన మార్క్ వ్యూహాన్ని యూపీ మీద అమలు చేయాలన్న ఆలోచనలో మోడీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

కొద్ది నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన రెండేళ్ల పాలనకుగుర్తుగా మొదటి సభను యూపీలోని  సహ్రాన్ పూర్ లో సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ సభకు ముస్లింల నుంచి సానుకూల స్పందన రావటమేకాదు.. మోడీ సభ కోసం తమ పొలాల్ని ఇచ్చిన ముస్లింల స్పందన పట్ల కమలనాథులు తెగ ఖుషీగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ముస్లిం ఓట్ బ్యాంక్ మీద దృష్టి పెట్టిన బీజపీకి.. తాజా ప్రధాని సభకు ముస్లింలు తమకు తాము తమ పొలాల్ని ఇచ్చేందుకు ముందుకు రావటం శుభ సూచకంగా భావిస్తున్నారు.
Tags:    

Similar News