పవన్ తో ఫోన్లో మాట్లాడిన ముద్రగడ

Update: 2016-05-29 10:27 GMT
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర ఎంత కీలకమన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం స్పష్టం చేస్తుందని చెప్పాలి. కాపు రిజర్వేషన్ అంశంపై ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం మరోమారు నిరసన గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ల అంశం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు విషయంలో తేడా వస్తే.. మరో భారీ ఉద్యమం తప్పదంటున్న ఆయన.. పలువురు నేతల్ని కలుసుకొని వారి మద్దతును కూడగడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ముద్రగడ.. మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడేందుకు వీలుగా ఫోన్లో కల్పించి ముద్రగడతో మాట్లాడించారు. పవన్ తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ముద్రగడ కన్ఫర్మ్ చేయటంతో పాటు.. కాపుల సంక్షేమం కోసం తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లుగా వెల్లడించారు.

పవన్ ఎలా స్పందించారన్న విషయంపై పెద్దగా మాట్లాడని ముద్రగడ.. పవన్ తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని వీలైనంత ఎక్కువగా చెప్పుకోవటం గమనార్హం. కాపు రిజర్వేషన్ల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల మీద పోరాటానికి సన్నద్ధమవుతున్న ముద్రగడ.. పవన్ మద్దతును పొందే ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో బాబు సర్కారుకు ఇబ్బంది పెట్టేలా అడుగులే వేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News